గుంటూరు : తెలంగాణలో పాలనను ముఖ్యమంత్రి కేసీఆర్ గాలికి వదిలేశారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండా రాఘవరెడ్డి ధ‍్వజమెత్తారు. ఆయన ఆదివారం పార్టీ ప్లీనరీ సమావేశాల్లో తెలంగాణ సామాజిక, ఆర్థిక అంశాలపై రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కొండా రాఘవరెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు, కేసీఆర్లు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా ఉండడం మన దురదృష్టకరమన్నారు. మహానేత దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాలను కేసీఆర్ నీరుగారుస్తున్నారని మండిపడ్డారు.
ఎన్నికల్లో 600 వందల వాగ్ధానాలు చేసి ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు ఇరుక్కుంటే మూడోకన్ను తెరుస్తానంటూ చెప్పిన కేసీఆర్ ఏమీ చేయకుండా తెలుగు ప్రజలను మోసం చేస్తున్నారని కొండా రాఘవరెడ్డి దుయ్యబట్టారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల పేరుతోనూ ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. దేశంలో 46 లక్షల ఇళ్లు కడితే ఒక్క ఏపీలోనే 37 లక్షల ఇళ్లు వైఎస్‌ఆర్ కట్టించారని చెప్పారు. ఏపీ, తెలంగాణలో ముఖ్యమంత్రులు ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చారన్నారు. రాజ్యాంగానికి విలువ ఇవ్వని ఇద్దరు ముఖ్యమంత్రులను, అరాచకాలను, భూదందాలను ఎమ్మెల్యేలను, ఎంపీలను కొనే పద్ధతిని ఖండిస్తూ తీర్మానాన్ని ప్రతిపాదిస్తున్నానన్నారు.
టీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై తీర్మానం ప్రవేశపెట్టిన... తెలంగాణ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత శివకుమార్ మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా కేసీఆర్ అమలు చేయడం లేదన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై కలిసికట్టుగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ జెండా రెపరెపలాడేందుకు అందరూ కృషి చేయాలని శివకుమార్ విజ్ఞప్తి చేశారు.
అలాగే వైఎస్‌ఆర్‌సీపీ కరీంనగర్ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ నగేష్ మాట్లాడుతూ 2019లో ఏపీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ జగన్‌కు అందరం అండగా నిలుద్దామని ఆయన అన్నారు.