
చేవెళ్లలో కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న కొండా రాఘవరెడ్డి
చేవెళ్ల: ఇచ్చిన హామీలు నెరవేర్చని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రజలు బుద్ధి చెప్పాలని వైఎస్సార్ తెలంగాణ పార్టీ చేవెళ్ల పార్లమెంట్ కన్వీనర్, ముఖ్య అధికార ప్రతినిధి కొండ రాఘవరెడ్డి పిలుపునిచ్చారు. తాము ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని ప్రకటించారు. పార్టీ చేవెళ్ల పార్లమెంట్ కార్యాలయాన్ని బుధవారం కో-కన్వీనర్ కోరని దయానంద్‌తో కలసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... అధికార పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలో 3 లక్షల మంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేశారని, ఇంకా 34 లక్షల మంది ఎదురుచూస్తున్నారని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో 64 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసిన ఘనత వైఎస్సార్‌ది అని తెలిపారు. వర్గీకరణ వైఎస్సార్ కల అని చెప్పారు. మంద కృష్ణ పోరాటానికి తాము పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటివరకే ఎస్సీ వర్గీకరణ జరిగి ఉండాలని.. కానీ పాలకుల నిర్లక్ష్యంతో జరగలేదని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు కోరని ఉదయ్ కిరణ్, పంబాల రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment