Debt Distress
-
అప్పుల బాధ నుంచి తప్పించుకునేందుకు చనిపోయినట్లు డ్రామా.. చివరికి
సాక్షి, బెంగళూరు: అప్పుల బాధ నుంచి తప్పించుకునేందుకు ఒక వ్యక్తి తాను చనిపోయినట్లు డ్రామా ఆడి అడ్డంగా దొరికిపోయాడు. ఈఘటన మాండ్య శ్రీరంగపట్టణ తాలూకా బొట్టనహళ్లి గ్రామంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలు.. గ్రామానికి చెందిన మను అనే వ్యక్తి ఫైనాన్స్ కంపెనీ ఏర్పాటు చేశాడు. బయట వ్యక్తుల వద్ద అప్పులు చేశాడు. బాకీ తీర్చాలని ఆసాములు ఒత్తిడి చేయడంతో గత నెల 12 నుంచి కనిపించకుండా పోయాడు. తాను ధరించిన విగ్‌కు కోడి రక్తం పూసి, చెప్పులను కాలువ వద్ద వదిలేసి గోవా వెళ్లాడు. వాటిని గమనించిన తల్లిదండ్రులు మనుని ఎవరో హత్య చేశారని భావించారు. ఇదిలా ఉండగా సుప్రియ అనే యువతికి రూ. 8 లక్షలు ఇచ్చినట్లు, అందుకు సంబంధించిన డాక్యుమెంట్ ఇవ్వాలని, లేదంటే సినిమా తరహాలో చంపేస్తానని ఓ వ్యక్తి మనును బెదిరించినట్లు ఒక ఆడియో వైరల్ అయింది. దీంతో మను తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టి మను బతికే ఉన్నట్లు గుర్తించి అరెస్ట్ చేశారు. అప్పుల బాధతోనే డ్రామా ఆడినట్లు అంగీకరించాడు. చదవండి: బెంగళూరులో ఘోరం.. తమ్ముని భార్య వేధిస్తోందని -
రైతులకు రుణమాఫీ చేసిన ఘనత వైఎస్సార్‌ది: రాఘవరెడ్డి
చేవెళ్ల: ఇచ్చిన హామీలు నెరవేర్చని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రజలు బుద్ధి చెప్పాలని వైఎస్సార్ తెలంగాణ పార్టీ చేవెళ్ల పార్లమెంట్ కన్వీనర్, ముఖ్య అధికార ప్రతినిధి కొండ రాఘవరెడ్డి పిలుపునిచ్చారు. తాము ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని ప్రకటించారు. పార్టీ చేవెళ్ల పార్లమెంట్ కార్యాలయాన్ని బుధవారం కో-కన్వీనర్ కోరని దయానంద్‌తో కలసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... అధికార పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో 3 లక్షల మంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేశారని, ఇంకా 34 లక్షల మంది ఎదురుచూస్తున్నారని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో 64 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసిన ఘనత వైఎస్సార్‌ది అని తెలిపారు. వర్గీకరణ వైఎస్సార్ కల అని చెప్పారు. మంద కృష్ణ పోరాటానికి తాము పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటివరకే ఎస్సీ వర్గీకరణ జరిగి ఉండాలని.. కానీ పాలకుల నిర్లక్ష్యంతో జరగలేదని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు కోరని ఉదయ్ కిరణ్, పంబాల రాజేశ్ తదితరులు పాల్గొన్నారు. -
'నా చావుకు బాకీలోల్లే కారణం'.. సెల్ఫీ వీడియో
-
తల్లి, కుమార్తె ఆత్మహత్య
సాక్షి, నెల్లూరు(క్రైమ్): కుటుంబ కలహాల నేపథ్యంలో తల్లి, కుమార్తెలు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన నెల్లూరు నగరంలోని ఏసీనగర్‌లో ఆదివారం తెల్లవారు జామున జరిగింది. పోలీసుల సమాచారం మేరకు.. తిరుపతి నగరానికి చెందిన కన్నప్ప, రాజేశ్వరమ్మ దంపతులు. వీరికి శారద (35) కుమార్తె ఉంది. చిన్నతనంలోనే తల్లి మృతి చెందింది. తండ్రి కొంతకాలం తర్వాత మృతి చెందాడు. తల్లిదండ్రులు ఎవరూ లేకపోవడంతో అప్పటి నుంచి బంధువుల ఇంట్లో ఉండేది. 2004లో శారద అదే ప్రాంతానికి చెందిన సురేష్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వారికి నీలిమ (13), గణేష్ ఇద్దరు పిల్లలు ఉనానరు. కొంతకాలం సజావుగా సాగిన వారి కాపురంలో కలతలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో 2010లో ఇద్దరు విడిపోయారు. శారద తన ఇద్దరి పిల్లలను పెట్టుకుని ఇళ్లలో పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఈ నేపథ్యంలో తిరుపతి అంబేడ్కర్ నగర్‌కు చెందిన ఆటోడ్రైవర్ తిరుపతి కిరణ్ అలియాస్ చందుతో ఆమెకు పరిచయం అయింది. ఇద్దరు సన్నిహితంగా ఉన్నారు. తొమ్మిదేళ్ల కిందట వారు ఉపాధి నిమిత్తం నెల్లూరు నగరానికి వచ్చారు. తొలి రోజుల్లో అపోలో హాస్పిటల్ సమీపంలో, ఆ తర్వాత బాలాజీనగర్ సీపీఎం కార్యాలయం సమీపంలో నివాసం ఉండేవారు. రెండేళ్ల కిందట ఏసీనగర్ çశానిటరీ కార్యాలయం సమీపంలోని ఓ ఇంట్లో చేరారు. నీలిమ, గణేష్‌లను మల్లెల సంజీవయ్య స్కూల్లో 8, 6వ తరగతుల్లో చేర్పించారు. ఆటో, ఇతర పనులు చేసి వచ్చిన సంపాదనతో పిల్లలను చదివించుకుంటూ హాయిగా జీవిస్తున్నారు. తరచూ శారద బంధువులు ఇంటికి వచ్చి ఆమె యోగక్షేమాలను తెలుసుకుని వెళ్లేవారు. అప్పుల బాధలు పెరగడంతో.. కిరణ్‌కుమార్ (ఫైల్) కిరణ్ కొంతకాలం కిందట తెలిసిన వారి వద్ద పెద్ద ఎత్తున అప్పులు చేశాడు. అవి తిరిగి చెల్లించలేకపోయాడు. ఈ విషయమై కిరణ్, శారద మధ్య గొడవలు చోటు చేసుకున్నాయి. సంక్రాంతి సమయంలో శారదకు చెప్పకుండా కిరణ్ ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. శారద అతని కోసం గాలించింది. కిరణ్ తిరుపతిలోని అతని తల్లిదండ్రుల వద్ద ఉన్నాడని తెలుసుకుని అక్కడి వెళ్లి తిరిగి రావాలని ప్రాధేయపడింది. అతను నిరాకరించాడు. ఇటీవల అతను అక్కడ నుంచి కూడా కనిపించకుండా వెళ్లిపోయాడు. అప్పులిచ్చిన వారు శారదపై ఒత్తిడి తెచ్చారు. దీంతో శారద పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కిరణ్ కనిపించకపోవడంతో అతని తండ్రిని పిలిచి విచారించారు. అతను అప్పులన్నింటిని తానే కడుతానని అంగీకరించడంతో సమస్య సర్దుమణిగింది. తిరుపతికి వెళ్లదామని చెప్పి.. శారద శనివారం రాత్రి తిరుపతికి వెళ్లదామని స్కూల్ నుంచి వచ్చిన కుమార్తె, కుమారుడికి తెలియజేసింది. అనంతరం ముగ్గురూ కలిసి నెల్లూరు ప్రధాన రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. గణేష్ మూత్ర విసర్జన చేయాలని తల్లికి చెప్పడంతో పక్కనే ఉన్న బాత్రూమ్కు వెళ్లమని చెప్పింది. గణేష్ అటు వెళ్లిన వెంటనే శారద కుమార్తె నీలిమను తీసుకుని ఇంటికి వచ్చేసింది. బాత్రూమ్ నుంచి బయటకు వచ్చిన గణేష్ తల్లి, అక్క కనిపించకపోవడంతో చుట్టు పక్కల గాలించారు. అప్పుడే రైలు వెళ్లడంతో తనను వదిలి తిరుపతికి వెళ్లిపోయి ఉంటారని ఏడుస్తూ ప్లాట్‌ఫాంపై తిరుగుతున్నాడు. గుర్తించిన రైల్వే పోలీసులు అతన్ని తమ వెంట పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లారు. విచారించగా జరిగిన విషయం చెప్పాడు. ఆదివారం ఉదయం వరకు పోలీసులు అతన్ని తమ వద్దనే ఉంచుకుని స్కూల్ ప్రాధానోపాధ్యాయురాలు హైమావతికి సమాచారం అందించారు. ఆమె రైల్వేస్టేషన్‌కు చేరుకుని గణేష్‌ను తీసుకుని అతని ఇంటి వద్దకు వెళ్లింది. ఇంట్లో ఉన్నారేమో చూడమని గణేష్‌ను లోపలికి పంపగా తలుపు నెట్టడంతో తెరుచుకున్నాయి. పడక గదిలో తల్లి ఫ్యాన్‌కు ఉరేసుకుని వేళాడుతూ, అక్క మంచంపై మృతి చెంది ఉన్నారు. ఈ విషయమై స్థానికులు బాలాజీనగర్ పోలీసులకు సమాచారం అందించారు. బాలాజీనగర్ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్‌రెడ్డి మరో కేసు విచారణలో ఉండటంతో సంతపేట ఇన్స్పెక్టర్ సీహెచ్ కోటేశ్వరరావు, బాలాజీనగర్ ఎస్సై ఏడుకొండలులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. శారద మృతదేహాన్ని కిందకు దించారు. ఘటన జరిగిన తీరును బట్టి చూస్తే శారద తొలుత తన కుమార్తెకు విషం ఇచ్చి ఆపై ఉరేసి, మృతి చెందిన అనంతరం తాను ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చునని పోలీసులు భావిస్తున్నారు. మృతురాలి బంధువుల వివరాలను సేకరించి వారికి సమాచారం అందించారు. మృతురాలి పెద్దమ్మ కుమారుడు షణ్ముగణం, బంధువులు హుటావుటిన నెల్లూరుకు చేరుకుని కన్నీటి పర్యంతమయ్యారు. ఘటన జరిగిన తీరు అనుమానాస్పదంగా ఉందన్న షణ్ముగం ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. మృతురాలి సెల్‌ఫోను, కిరణ్ సెల్‌ఫోన్ కాల్ డీటైల్స్‌ను పరిశీలిస్తున్నారు. ఘటనా స్థలంలో క్లూస్‌టీం వేలిముద్రలను సేకరించింది. డాగ్స్వాడ్ ఘటనా జరిగిన ప్రాంతంలో కలియ తిరిగింది. మృతదేహాన్ని పోలీసులు జీజీహెచ్ మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మా అమ్మను బతికించండి
వారిదో నిరుపేద కుటుంబం. భార్యాభర్త... ఇద్దరు పిల్లలు. భర్త అంధుడు కావడంతో కుటుంబపోషణంతా ఆమెపైనే... రెక్కలు ముక్కలు చేసుకుని కూలీ పనిచేస్తూ కుటుంబాన్ని సాకింది. ప్రభుత్వం ఇచ్చిన 20 గుంటల భూమికి మరో 20 గుంటలు కౌలుకు తీసుకుని పత్తి వేయగా... కలిసిరాని కాలం కరువు రూపంలో వెంటాడింది. పెట్టుబడి, కుటుంబపోషణకు చేసిన అప్పు తీర్చే మార్గం కనిపించక చావే శరణ్యమనుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. ప్రస్తుతం చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. మెరుగైన వైద్యం అందిస్తే బతికే అవకాశముండడంతో తల్లిని బతికించుకునేందుకు ఆ పన్నెండేళ్ల పిల్లాడు చేతులు జోడించి వేడుకుంటున్నాడు. * అప్పులబాధతో మహిళా రైతు ఆత్మహత్యాయత్నం * చికిత్సకు చిల్లిగవ్వ లేక చావుబతుకుల మధ్య పోరాటం * అంధుడైన భర్త.. ఇద్దరు పిల్లలకు ఆమే ఆధారం * దాతలు సాయం చేస్తే నిలువనున్న నిండుప్రాణం జమ్మికుంట: వీణవంక మండలం పోతిరెడ్డిపల్లికి చెందిన కారుపాకల రమ-రవిది నిరుపేద కుటుంబం. వీరికి కుమారుడు అంజి(12), కుమార్తె అమూల్య(7) ఉన్నారు. రవి అంధుడు కావడంతో కుటుంబపోషణ భారమంతా రమపైనే. కూలీ పనులకు వెళ్తూ రెక్కలు ముక్కలు చేసుకుంటూ కుటుంబాన్ని వెళ్లదీస్తోంది. ప్రభుత్వ పాఠశాలలో అంజి ఏడో తరగతి, అమూల్య రెండో తరగతి చదువుతున్నారు. ప్రభుత్వం గతంలో వీరికి 20 గుంటల భూమి మంజూరు చేసింది. ఈ 20 గుంటలతోపాటు పక్కనే ఉన్న మరో 20 గుంటలు కౌలుకు తీసుకుని ఈ ఏడాది పత్తిపంట వేశారు. మిగతా సమయంలో ఆమె కూలీకి వెళ్తుంది. సాగు పెట్టుబడి కోసం రూ.20 వేలు అప్పు చేశారు. కరువు వెంటాడడంతో పంట చేతికి రాకుండా కళ్లముందే ఎండిపోయింది. తెలిసినవారి వద్ద అప్పు చేసి కుటుంబాన్ని నెట్టుకొచ్చింది. కరువు ఛాయలతో చేసేందుకు పనిలేకపోగా కుటుంబపోషణ భారంగా మారింది. అప్పులు ఇచ్చినోళ్లు ఇంటిచుట్టూ తిరుగుతుండడంతో మనోవేదన చెందింది. అప్పు కట్టే స్థోమత లేక ఆత్మహత్యే శరణ్యమనుకుంది. ఈ నెల 3న పిల్లలిద్దరినీ పాఠశాలకు పంపించింది. అనంతరం ఇంట్లోనే క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తన ముందే భార్య పురుగుల మందు తాగుతున్నా... కళ్లు కనిపించకపోవడంతో రవి ఏమీ చేయలేకపోయాడు. కిందపడి కొట్టుకుంటున్నా.. ఏం జరిగిందో తెలుసుకోలేకపోయాడు. ఇరుగుపొరుగు ఆ సమయంలో రమ కోసం ఇంటికి రాగా ఆమె ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతూ కనిపించింది. వెంటనే ఆమెను జమ్మికుంటలోని విజయ్‌సాయి ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స పొందుతోంది. అమ్మ ఆస్పత్రిలో ఉండగా, తండ్రి ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండడంతో తాత(రమ తండ్రి) వచ్చి పిల్లలను చూసుకుంటున్నాడు. ఆస్పత్రిలో కుమారుడే తల్లికి సపర్యలు చేస్తున్నాడు. ఇప్పటికే రూ.1.50 లక్షల ఖర్చు రమ వారం రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఇప్పటికే లక్షన్నర రూపాయలు ఖర్చయ్యాయి. చేతిలో చిల్లి గవ్వలేక... కుటుంబాన్ని పోషించలేక... అప్పులు చెల్లించలేక చనిపోవాలని నిర్ణయించుకున్న రమ ప్రాణపాయస్థితిలో ఉండగా కుమారుడు అంజి తన తల్లిని బతికించాలని వేడుకుంటున్నాడు. ఇంటి పెద్ద దిక్కు చావుబతుకుల మధ్య ఆస్పత్రిలో ఉంటే కనిపించినవారినల్లా తమ తల్లిని కాపాడాలని వేడుకుంటున్నాడు. తన తల్లి లేకుంటే నాన్న, తాను, చెల్లి ఎలా బతికేదంటూ కన్నీరు పెట్టుకుంటున్నాడు. మా అందరికీ అమ్మే దిక్కని, అమ్మ లేకుంటే తాము బతకలేమని విలపిస్తున్నాడు. మెరుగైన వైద్యం చేస్తే తన తల్లి బతికే అవకాశముందని డాక్టర్లు చెబుతున్నారని... చేతిలో చిల్లిగవ్వ లేక తామెలా వైద్యం చేయించేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇప్పటివరకు అయిన రూ.లక్షన్నర ఖర్చు ఆస్పత్రి వైద్యుడే భరిస్తున్నాడు. రమను బతికించాలనే తపనతో డాక్టర్ సురంజన్ శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు. తన తల్లి ప్రాణాలు కాపాడేందుకు దాతలు ముందుకు రావాలని కుమారుడు అంజి, రమ తండ్రి ఐలమల్లు వేడుకుంటున్నారు. మెరుగైన వైద్యం అందితే బతికే అవకాశం రమ పరిస్థితి విషమంగా ఉంది. వారం రోజులుగా చికిత్స అందిస్తున్నాం. సకాలంలో తీసుకురావడం వల్ల చికిత్స చేసే అవకాశం వచ్చింది. ఇప్పుడు ఆమెను ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడేందుకు మెరుగైన చికిత్సతో అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వారం రోజులుగా వెంటిలేటర్‌పై ఆక్సీజన్ అందిస్తూ ఖరీదైన మందులు వేస్తూ ప్రాణాలు కాపాడుతున్నాం. ఇప్పటికే రూ.లక్షన్నర ఖర్చు వచ్చింది. మరో రూ.లక్షన్నర ఖర్చయ్యే అవకాశముంది. దాతలు ముందుకు వస్తే ఆమెకు పునర్జన్మ ప్రసాదించినవారవుతారు. పేదరికం, కుటుంబపోషణలో ఇబ్బందులతో తొందరపాటులో ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం బాధాకరం. ఇద్దరు చిన్న పిల్లలు, తండ్రి అంధుడు అయిన ఈ కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిస్తే బాగుంటుంది. దాతలు కూడా ముందుకు రావాలి. - సురంజన్, వైద్యుడు, విజయ్‌సాయి హాస్పిటల్