మా అమ్మను బతికించండి | Debt Distress Poor family | Sakshi
Sakshi News home page

మా అమ్మను బతికించండి

Published Wed, Feb 10 2016 1:48 AM | Last Updated on Sun, Sep 3 2017 5:17 PM

మా అమ్మను బతికించండి

మా అమ్మను బతికించండి

వారిదో నిరుపేద కుటుంబం. భార్యాభర్త... ఇద్దరు పిల్లలు. భర్త అంధుడు కావడంతో కుటుంబపోషణంతా ఆమెపైనే... రెక్కలు ముక్కలు చేసుకుని కూలీ పనిచేస్తూ కుటుంబాన్ని సాకింది. ప్రభుత్వం ఇచ్చిన 20 గుంటల భూమికి మరో 20 గుంటలు కౌలుకు తీసుకుని పత్తి వేయగా... కలిసిరాని కాలం కరువు రూపంలో వెంటాడింది. పెట్టుబడి, కుటుంబపోషణకు చేసిన అప్పు తీర్చే మార్గం కనిపించక చావే శరణ్యమనుకుని ఆత్మహత్యాయత్నం చేసింది.

ప్రస్తుతం చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. మెరుగైన వైద్యం అందిస్తే బతికే అవకాశముండడంతో తల్లిని బతికించుకునేందుకు ఆ పన్నెండేళ్ల పిల్లాడు చేతులు జోడించి వేడుకుంటున్నాడు.

 
* అప్పులబాధతో మహిళా రైతు ఆత్మహత్యాయత్నం
* చికిత్సకు చిల్లిగవ్వ లేక చావుబతుకుల మధ్య పోరాటం
* అంధుడైన భర్త.. ఇద్దరు పిల్లలకు ఆమే ఆధారం
* దాతలు సాయం చేస్తే నిలువనున్న నిండుప్రాణం

జమ్మికుంట: వీణవంక మండలం పోతిరెడ్డిపల్లికి చెందిన కారుపాకల రమ-రవిది నిరుపేద కుటుంబం. వీరికి కుమారుడు అంజి(12), కుమార్తె అమూల్య(7) ఉన్నారు. రవి అంధుడు కావడంతో కుటుంబపోషణ భారమంతా రమపైనే. కూలీ పనులకు వెళ్తూ రెక్కలు ముక్కలు చేసుకుంటూ కుటుంబాన్ని వెళ్లదీస్తోంది. ప్రభుత్వ పాఠశాలలో అంజి ఏడో తరగతి, అమూల్య రెండో తరగతి చదువుతున్నారు.

ప్రభుత్వం గతంలో వీరికి 20 గుంటల భూమి మంజూరు చేసింది. ఈ 20 గుంటలతోపాటు పక్కనే ఉన్న మరో 20 గుంటలు కౌలుకు తీసుకుని ఈ ఏడాది పత్తిపంట వేశారు. మిగతా సమయంలో ఆమె కూలీకి వెళ్తుంది. సాగు పెట్టుబడి కోసం రూ.20 వేలు అప్పు చేశారు. కరువు వెంటాడడంతో పంట చేతికి రాకుండా కళ్లముందే ఎండిపోయింది. తెలిసినవారి వద్ద అప్పు చేసి కుటుంబాన్ని నెట్టుకొచ్చింది. కరువు ఛాయలతో చేసేందుకు పనిలేకపోగా కుటుంబపోషణ భారంగా మారింది.

అప్పులు ఇచ్చినోళ్లు ఇంటిచుట్టూ తిరుగుతుండడంతో మనోవేదన చెందింది. అప్పు కట్టే స్థోమత లేక ఆత్మహత్యే శరణ్యమనుకుంది. ఈ నెల 3న పిల్లలిద్దరినీ పాఠశాలకు పంపించింది. అనంతరం ఇంట్లోనే క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తన ముందే భార్య పురుగుల మందు తాగుతున్నా... కళ్లు కనిపించకపోవడంతో రవి ఏమీ చేయలేకపోయాడు. కిందపడి కొట్టుకుంటున్నా.. ఏం జరిగిందో తెలుసుకోలేకపోయాడు.

ఇరుగుపొరుగు ఆ సమయంలో రమ కోసం ఇంటికి రాగా ఆమె ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతూ కనిపించింది. వెంటనే ఆమెను జమ్మికుంటలోని విజయ్‌సాయి ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స పొందుతోంది. అమ్మ ఆస్పత్రిలో ఉండగా, తండ్రి ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండడంతో తాత(రమ తండ్రి) వచ్చి పిల్లలను చూసుకుంటున్నాడు. ఆస్పత్రిలో కుమారుడే తల్లికి సపర్యలు చేస్తున్నాడు.
 
ఇప్పటికే రూ.1.50 లక్షల ఖర్చు

రమ వారం రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఇప్పటికే లక్షన్నర రూపాయలు ఖర్చయ్యాయి. చేతిలో చిల్లి గవ్వలేక... కుటుంబాన్ని పోషించలేక... అప్పులు చెల్లించలేక చనిపోవాలని నిర్ణయించుకున్న రమ ప్రాణపాయస్థితిలో ఉండగా కుమారుడు అంజి తన తల్లిని బతికించాలని వేడుకుంటున్నాడు. ఇంటి పెద్ద దిక్కు చావుబతుకుల మధ్య ఆస్పత్రిలో ఉంటే కనిపించినవారినల్లా తమ తల్లిని కాపాడాలని వేడుకుంటున్నాడు. తన తల్లి లేకుంటే నాన్న, తాను, చెల్లి ఎలా బతికేదంటూ కన్నీరు పెట్టుకుంటున్నాడు.

మా అందరికీ అమ్మే దిక్కని, అమ్మ లేకుంటే తాము బతకలేమని విలపిస్తున్నాడు. మెరుగైన వైద్యం చేస్తే తన తల్లి బతికే అవకాశముందని డాక్టర్లు చెబుతున్నారని... చేతిలో చిల్లిగవ్వ లేక తామెలా వైద్యం చేయించేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇప్పటివరకు అయిన రూ.లక్షన్నర ఖర్చు ఆస్పత్రి వైద్యుడే భరిస్తున్నాడు. రమను బతికించాలనే తపనతో డాక్టర్ సురంజన్ శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు. తన తల్లి ప్రాణాలు కాపాడేందుకు దాతలు ముందుకు రావాలని కుమారుడు అంజి, రమ తండ్రి ఐలమల్లు వేడుకుంటున్నారు.
 
మెరుగైన వైద్యం అందితే బతికే అవకాశం
రమ పరిస్థితి విషమంగా ఉంది. వారం రోజులుగా చికిత్స అందిస్తున్నాం. సకాలంలో తీసుకురావడం వల్ల చికిత్స చేసే అవకాశం వచ్చింది. ఇప్పుడు ఆమెను ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడేందుకు మెరుగైన చికిత్సతో అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వారం రోజులుగా వెంటిలేటర్‌పై ఆక్సీజన్ అందిస్తూ ఖరీదైన మందులు వేస్తూ ప్రాణాలు కాపాడుతున్నాం. ఇప్పటికే రూ.లక్షన్నర ఖర్చు వచ్చింది. మరో రూ.లక్షన్నర ఖర్చయ్యే అవకాశముంది.

దాతలు ముందుకు వస్తే ఆమెకు పునర్జన్మ ప్రసాదించినవారవుతారు. పేదరికం, కుటుంబపోషణలో ఇబ్బందులతో తొందరపాటులో ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం బాధాకరం. ఇద్దరు చిన్న పిల్లలు, తండ్రి అంధుడు అయిన ఈ కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిస్తే బాగుంటుంది. దాతలు కూడా ముందుకు రావాలి.
 - సురంజన్, వైద్యుడు, విజయ్‌సాయి హాస్పిటల్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement