సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ పాలనలో దగాపడ్డ తెలంగాణ జనానికి గుండె ధైర్యం కల్పిస్తూ అక్టోబర్ 20 నుంచి ప్రజాప్రస్థాన పాదయాత్ర చేయనున్నట్లు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలిపారు. తన తండ్రి, దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి చూపిన బాటలో చేవెళ్ల నుంచే తన యాత్ర మొదలవుతుందని, అక్కడే ముగుస్తుందని ఆమె వెల్లడించారు.
లోటస్‌పాండ్‌లో ప్రజా ప్రస్థానం పోస్టర్‌ను విడుదల చేస్తున్న వైఎస్ షర్మిల
హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని పార్టీ కార్యాలయంలో సోమవారం షర్మిల మీడియాతో మాట్లాడుతూ, పాదయాత్ర స్వరూపాన్ని, ఉద్దేశాన్ని వివరించారు. గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతం మినహా.. 90 నియోజకవర్గాల్లో ప్రతీ పల్లెను, గడపనూ తాకుతూ ఏడాదికిపైగా పాదయాత్ర కొనసాగుతుందని తెలిపారు. పాదయాత్ర మొత్తం తాను రోడ్డు పక్కే ఆవాసం ఏర్పాటు చేసుకుంటానని, ప్రజలతోనే మమేకమవుతానని స్పష్టం చేశారు. ప్రజల కష్టాలు, కన్నీళ్లు ఆలకించేందుకే సమయం కేటాయిస్తానని చెప్పారు. పాదయాత్రలో భాగంగా బహిరంగ సభలూ నిర్వహిస్తామన్నారు. ఈ సందర్భంగా ఆమె కేసీఆర్ పాలనపై నిప్పులు చెరిగారు. 3 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసి, 36 లక్షల మందికి ఎగ్గొట్టారని, దీంతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, 16 లక్షల మంది కౌలు రైతులు దిక్కులేని స్థితిలో ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
కేసీఆర్ వచ్చాక దళితులపై 800 శాతం, మహిళలపై 300 శాతం దాడులు పెరిగాయని తెలిపారు. నిరుద్యోగులు బలవన్మరణాలకు పాల్పడుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా లేదన్నారు. పాదయాత్రలకు వైఎస్సార్ కుటుంబమే పెట్టింది పేరని, వైఎస్సార్ పాదయాత్రలోంచే ఉచిత విద్యుత్, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ పుట్టాయని చెప్పిన షర్మిల.. వైఎస్సార్ సంక్షేమ పాలనను ప్రజలకు గుర్తు చేస్తామన్నారు. ప్రభుత్వం ఉద్యోగ నియామక నోటిఫికేషన్ ఇచ్చే దాకా.. పాదయాత్రలోనూ మంగళవారం దీక్షలు కొనసాగుతాయని షర్మిల చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment