
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల చేపట్టబోయే పాదయాత్రకు ముహూర్తం ఖరారైనట్లు సమాచారం. అక్టోబర్ 18 నుంచి చేపట్టే పాదయాత్రను ఆమె చేవెళ్ల నుంచి ప్రారంభించనున్నట్లు తెలిసింది. గతంలో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా చేవెళ్ల నుంచి పాదయాత్రను ప్రారంభించిన విషయం విదితమే. ఇప్పటికే రెండుసార్లు పాదయాత్రను విజయవంతంగా పూర్తి చేసిన షర్మిల ఇప్పుడు మూడో పర్యాయం నిర్వహించతలపెట్టారు.
తెలంగాణలో రాజన్న రాజ్యాన్ని తీసుకురావడమే తన లక్ష్యమని ప్రకటించిన షర్మిల అందుకు అనుగుణంగా పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఈ కార్యక్రమం దోహదపడుతుందని భావిస్తున్నారు. కాగా, మంగళవారం హుజురాబాద్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం సిరిసేడులో ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి మహమ్మద్ షబ్బీర్ కుటుంబాన్ని పరామర్శించి నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆ పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది.