
వైసీపీ తెలంగాణ వర్కింగ్ ప్రసిడెంట్ గా పొంగులేటి పేరును ప్రకటిస్తున్న వైఎస్ జగన్
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఎన్నికయ్యారు. ఈ మేరకు బుధవారం జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశంలో పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి, పొంగులేటి పేరును ప్రకటించారు. అలాగే తెలంగాణలో పార్టీని పటిష్టం చేసే దిశగా పొంగులేటికి తోడుగా షర్మిల బాధ్యతలు తీసుకుంటారని జగన్ తెలిపారు. తెలంగాణలో పార్టీ పునర్ నిర్మాణానికి సంబంధించిన కార్యక్రమాలన్నీ పొంగులేటి అధ్యక్షతన జరుగుతాయంటూ ఆయున పేరును ప్రకటించిన వెంటనే పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి.
ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడతాం: పొంగులేటి
పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన అనంతరం పొంగులేటి ప్రసంగించారు. ‘నా మీద నమ్మకంతో వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు కట్టబెట్టినందుకు జగన్‌కు ధన్యవాదాలు. నా మీద పెట్టిన నమ్మకం వమ్ము చేయకుండా, షర్మిలతో కలసి పార్టీ పటిష్టతకు పాటుపడతా’ అని అన్నారు. ‘వైఎస్ తన హయూంలో బడుగులు, దళితులు, మైనార్టీలు, విద్యార్థులు, వృద్ధులు, వికలాంగులకు భరోసా ఇచ్చారు. టీఆర్‌ఎస్ సైతం అవే వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చింది. ఇప్పటికి నాలుగు నెలలు అయినా చేసిన వాగ్దానాలను నెరవేర్చలేదు. రాష్ట్రంలో, కేంద్రంలో ఎక్కడైనా ప్రభుత్వాలు ప్రజలకు మంచి చేస్తే స్వాగతిస్తాం, అలాకాకుండా ప్రజా వ్యతిరేకంగా వ్యవహరిస్తే పోరాడతాం’ అని పేర్కొన్నారు.
పొంగులేటికి శుభాకాంక్షల వెల్లువ: వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి పార్టీ నేతల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సభ ముగిసిన అనంతరం పార్టీ సీనియర్ నేతలు ఆయనను అభినందించేందుకు పోటీపడ్డారు. జిల్లాల నుంచి వచ్చిన నేతలు, కార్యకర్తలు ఆయునకు శుభాకాంక్షలు తెలిపారు.