
సోమవారం జూపార్క్‌లో పక్షుల ఎన్‌క్లోజర్‌ను ప్రారంభిస్తున్న మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: నగరంలోని నెహ్రూ జూలాజికల్ పార్క్‌ను దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. నగరంలోని జూపార్కుతో సహా రాష్ట్రంలోని తొమ్మిది జూపార్కుల్లో సందర్శకుల కోసం మెరుగైన సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు. సోమవారం జూపార్క్‌లో జూస్ అండ్ పార్క్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (జపాట్) గవర్నింగ్ బాడీ సమావేశంలో తెలంగాణలోని ఎనిమిది జూలు, పార్కుల తీరుతెన్నులను ఆయన సమీక్షించారు.
టెక్ మహీంద్రా కంపెనీ సామాజిక బాధ్యత కింద రూ.కోటితో జూపార్క్ ఎంట్రీ గేట్ పునరాకృతి, ఫుడ్‌కోర్టు నిర్మాణం చేపట్టేందుకు ముందుకు రాగా బోర్డు దానికి అనుమతినిచ్చింది. రోజురోజుకూ జూకు వచ్చే సందర్శకుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో 2020–2040 పేరుతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు రూపొందించిన మాస్టర్ ప్లాన్‌పై ఈ సమావేశంలో చర్చించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, పీసీసీఎఫ్ ప్రశాంత్‌కుమార్ ఝా, అదనపు పీసీసీఎఫ్ మునీంద్ర, జూ పార్కుల డైరెక్టర్ సిద్దానంద్ కుక్రేటి, సీసీఎఫ్ అక్బర్, ఓఎస్డీ శంకరన్, జూపార్క్ క్యూరేటర్ క్షితిజ తదితరులు పాల్గొన్నారు.
జూపార్కుకు అదనపు ఆకర్షణలు..
నగరంలోని జూపార్కు అదనపు ఆకర్షణలతో సందర్శకులను మరింతగా అలరించనుందని ఇంద్రకరణ్‌రెడ్డి చెప్పారు. సోమవారం నెహ్రూ పార్క్‌లో ఆఫ్రికన్ సింహం, దాని రెండు కూనలు, ఆస్ట్రిచ్ పక్షులు, స్టార్క్ ఎన్‌క్లోజర్స్, డక్ ఫాండ్ వాక్ త్రూ ఇవరీలను మంత్రి ప్రారంభించారు. అనంతరం మహారాష్ట్ర అమరావతి యూనివర్సిటీకి చెందిన గడ్డి శాస్త్ర పరిశోధకుడు డా.మురాత్కర్‌ను మంత్రి సన్మానించారు.
Comments
Please login to add a commentAdd a comment