
జెడ్పీ ఎన్నిక లాంఛనమే
కరీంనగర్ సిటీ : జిల్లా ప్రజా పరిషత్ నూతన పాలకవర్గం శనివారం కొలువుదీరనుంది. మూడేళ్ల ప్రత్యేకాధికారుల పాలనకు ముగింపు పలుకుతూ జెడ్పీ ఇక ప్రజాప్రతినిధుల పాలనలోకి రానుంది. ఉదయం 9.30 నుంచి ప్రారంభమయ్యే ఎన్నికల ప్రక్రియ... సాయంత్రం చైర్‌పర్సన్, వైస్‌చైర్మన్ ఎన్నికతో పూర్తికానుంది. ముందుగా రెండు కో-ఆప్షన్ పదవులకు నామినేషన్లు స్వీకరించి మధ్యాహ్నం ఒంటిగంటకు నూతన జెడ్పీటీసీల ప్రమాణస్వీకారం కార్యక్రమం చేపడతారు. అనంతరం అవసరమైతే కో-ఆప్షన్ పదవులకు ఎన్నిక నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3గంటలకు జెడ్పీ చైర్‌పర్సన్, వైస్‌చైర్మన్ ఎన్నికలను నిర్వహిస్తారు. ఒకరే పోటీపడితే ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటిస్తారు. ఎన్నిక అవసరమైతే చేతులెత్తే పద్ధతిన విజేతను నిర్ణయిస్తారు. జెడ్పీ ప్రత్యేకాధికారి, ఇన్‌చార్జి కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ ఎన్నికల అధికారిగా వ్యవహరించనున్నారు.
ఉమ ఎన్నిక లాంఛనమే
జిల్లాపరిషత్‌లో 57 స్థానాలకు గాను 41 స్థానాల్లో టీఆర్‌ఎస్ జయకేతనం ఎగురవేసి భారీ మెజారిటీని సొంతం చేసుకుంది. చైర్‌పర్సన్, వైస్‌చైర్మన్, రెండు కోఆప్షన్ పదవులు టీఆర్‌ఎస్ ఖాతాలోకి పోవడం ముందుగానే ఖాయమైంది. టీఆర్‌ఎస్ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, కథలాపూర్ జెడ్పీటీసీ తుల ఉమను చైర్‌పర్సన్‌గా పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఇప్పటికే నిర్ణయించారు.
చైర్‌పర్సన్ పదవికి పలువురు పోటీపడ్డా, ఒకరిద్దరు ఎమ్మెల్యేలు విముఖంగా ఉన్నా... ఉమ పార్టీకి చేసిన సేవలను గుర్తించిన కేసీఆర్ ఆమె వైపే మొగ్గుచూపారు. పార్టీ పరంగా ప్రిసైడింగ్ అధికారికి అందజేసే ఆథరైజేషన్ లెటర్‌ను ఉమ పేరిట జారీ చేశారు. దీంతో ఆమె ఎన్నిక లాంఛనమే కానుంది. పార్టీ మరో సీనియర్ నాయకుడు బెజ్జంకి జెడ్పీటీసీ సభ్యుడు తన్నీరు శరత్‌రావు వైస్ చైర్మన్ కానున్నారు. ఇప్పటికే ఆయన అభ్యర్థిత్వం ఖరారైంది. కో ఆప్షన్ సభ్యుల ఎంపికలోనే పార్టీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు.
నేడు కాంగ్రెస్ నిర్ణయం
జెడ్పీ చైర్‌పర్సన్ ఎన్నికల్లో పోటీపై కాంగ్రెస్ పార్టీ శనివారం ఉదయం నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటికే ఆ పార్టీకి డీసీసీ అధ్యక్షుడు కటకం మృత్యుంజయం విప్‌గా వ్యవహరిస్తున్నారు. 14 మంది జెడ్పీటీసీలున్న కాంగ్రెస్ పార్టీ గెలిచే బలం లేనప్పటికీ పోటీ చేయాలని గతంలో నిర్ణయించింది. శనివారం ఉదయం 8 గంటలకు డీసీసీ కార్యాలయంలో జెడ్పీటీసీలు, సీనియర్ నాయకులతో జరిగే సమావేశంలో చర్చించి పోటీపై నిర్ణయం ప్రకటిస్తామని మృత్యుంజయం తెలిపారు.
ఏర్పాట్లు పూర్తి
జెడ్పీ పాలకవర్గం ఎన్నికల కోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇన్‌చార్జి కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ ఆధ్వర్యంలో జెడ్పీ సీఈవో సదానందం ఏర్పాట్లు చేస్తున్నారు. జెడ్పీ సమావేశ మందిరంలో పార్టీలవారీగా సీటింగ్ కేటాయించారు. ముందు వరుసలో ఎక్స్ అఫిషియో సభ్యులకు, తరువాతి వరుసలో జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ సభ్యులకు, వెనుక వరుసలో టీడీపీ, టీఆర్‌ఎస్ సభ్యులకు సీటింగ్ ఏర్పాటు చేశారు.
తొలిసారి బహిరంగ సభ
జెడ్పీసమావేశ మందిరంలో ఎన్నిక ప్రక్రియ పూర్తయిన అనంతరం నూతన పాలకమండలికి బహిరంగంగా అభినందన సభ నిర్వహించనున్నారు. ఈ సభలో ఎంపీ, ఎమ్మెల్యేలు, నాయకులు పాల్గొననున్నారు. దీనికోసం జెడ్పీ ఆవరణలో ప్రత్యేకంగా సభావేదిక ఏర్పాటు చేశారు.
మూడేళ్ల తర్వాత
జెడ్పీ పాలకమండలి మూడేళ్ల తర్వాత కొలువుదీరనుంది. చివరిసారిగా 2011 జూలై 22న గత పాలకమండలి గడువు ముగిసింది. అప్పుడు చైర్మన్‌గా అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ఉన్నారు. ఎన్నికలు నిర్వహించకపోవడంతో అప్పటినుంచి జెడ్పీ ప్రత్యేకాధికారుల పాలనలో కొనసాగుతోంది. కలెక్టర్ ప్రత్యేకాధికారిగా ఉన్నారు.