సీఎం మదిలో ఎవరో?
కేసీఆర్ చెంతకు జడ్పీ చైర్మన్ ఎంపిక వ్యవహారం
- మెజార్టీ ఉన్నా గుంభనంగా గులాబీ దళపతి
- అనుచరుల కోసం నలుగురు ఎమ్మెల్యేల యత్నం
- తొందరపడుతున్న ఆశావహ జడ్పీటీసీలు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ఇందూరు జడ్పీ పీఠం ఎవరిని వరిస్తుంది..? పోటాపోటీగా ప్రయత్నిస్తున్న ఆ నలుగురిలో ఎవరికి దక్కుతుంది..? స్పష్టమైన మెజార్టీ ఉన్నా చైర్మన్ అభ్యర్థి ఎంపికలో టీఆర్‌ఎస్ ఎందుకు జాప్యం చేస్తోంది..? జిల్లా మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఎవరికి మద్దతిస్తారు..? గులాబీ దళపతి గుంభనంగా ఎందుకుంటున్నారు..? ఆయన మదిలో ఎవరున్నారు..?
ఎన్నికల సంఘం త్వరలోనే జడ్పీ, మున్సిపల్ చైర్మన్లపై ఓ నిర్ణయానికి వస్తుందన్న ప్రచారం నేపథ్యంలో.. టీఆర్‌ఎస్ జిల్లా నేతలతో పాటు రాజకీ య విశ్లేషకుల్లో సాగుతున్న ఆయా అంశాలు ఆసక్తి రేపుతున్నాయి. మండల పరిషత్, జిల్లా పరిష త్ సభ్యుల ఎన్నికలు జరిగి మూడు నెలలు కా వస్తుండగా.. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎంపీపీ, జడ్పీ చైర్మన్ల ఎన్నికపై అనిశ్చితి నెల కొంది.
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగిసి రాష్ట్రంలో కొత్త సర్కారు ఏర్పాటైంది. ఇక మేయర్, మున్సిపల్ చైర్మన్లు, ఎంపీపీ, జడ్పీ చైర్మన్‌ల ఎంపికపై త్వరలోనే ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అత్యధిక జడ్పీటీసీ స్థానాలు కైవసం చే సుకున్న టీఆర్‌ఎస్‌లో జడ్పీ చైర్మన్ అయ్యే అదృష్టం ఎవరిని వరిస్తుందోనన్న చర్చ జోరందుకుంది.
కేసీఆర్ పేషీకి చైర్మన్ వ్యవహారం
ఇందూరు జడ్పీ చైర్మన్ వ్యవహారం చివరకు టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ పేషీకి చేరింది. ఈవిషయంలో కొంతకాలంగాకేసీఆర్ మౌనం వహిస్తునాడొఒ్నరు. జడ్పీటీసీ సభ్యులైన తమ అనుచరుల పేర్లను సూచించిన పలువురు ఎమ్మెల్యేలు తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఇలా కీలకంగా మారిన నిజామాబాద్ జడ్పీ చైర్మన్ వ్యవహారంపై చివరకు కేసీఆర్ నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ నేపథ్యంలోనే కొందరు ఎమ్మెల్యేలతో పాటు పలువురు జిల్లా ముఖ్యనేతలతో కేసీఆర్ మాట్లాడినట్లు చెబుతున్నారు. చైర్మన్ పదవి కోసం ప్రధానంగా నలుగురు పోటీ పడుతుండగా.. ఆయా నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నలుగురు ఎమ్మెల్యేలు తమ అనుచరుడికే ఇవ్వాలని ఎవరికీ వారుగా కేసీఆర్‌కు ప్రతిపాదించినట్లు తెలిసింది. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యేల ప్రతిపాదనలను పరిశీలిస్తున్నట్లు పార్టీ నేతలు పేర్కొంటున్నారు.
ఆ నలుగురిలో పీఠమెవరికో
జిల్లాలోని 36 మండలాలకు గాను 24 జడ్పీటీసీ స్థానాలను టీఆర్‌ఎస్ అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. మిగితా 12స్థానాలను కాంగ్రెస్ గెలుచుకోగా.. టీ డీపీ, బీజేపీలకు ఒక్కస్థానం కూడా దక్కలేదు. స్పష్టమైన మెజార్టీ సాధించిన టీఆర్‌ఎస్ సభ్యుల్లో నలుగురు చైర్మన్ పదవి కోసం పోటీ పడుతున్నారు. ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాల్లో అన్ని స్థానాలను టీఆర్‌ఎస్ కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో గాంధారి మండల జడ్పీటీసీ సభ్యుడు హరాలే తానాజీరావు, కోటగిరి జడ్పీటీసీ పుప్పాల శంకర్, భిక్కనూరు, నిజాంసాగర్‌ల నుంచి ఎన్నికైన నంద రమేశ్, డి.రాజు జడ్పీ పీఠం కోసం పోటీ పడుతున్నారు.
ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్‌రెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, గంప గోవర్ధన్, హన్మంత్‌షింధే తమ తమ అనుచరులకు జడ్పీ పీఠం కట్టబెట్టాలని ఎవరికి వారు తాజాగా కేసీఆర్‌ను కోరినట్లు తెలిసింది. పోచారం శ్రీనివాస్‌రెడ్డికి మంత్రి పదవి కట్టబెట్టడంతో జడ్పీ చైర్మన్ విషయంలో మిగతా ముగ్గురు ఎమ్మెల్యేల సిఫారసులను కేసీఆర్ పరిగణలోకి తీసుకునే అవకాశం ఉందని పార్టీవర్గాలు పేర్కొంటున్నాయి.
ఎన్నికల ఫలితాల అనంతరం మే 14న పార్టీ అధిష్టానం 24 మంది జడ్పీటీసీలను క్యాంపునకు తరలించింది. వారితో హైదరాబాద్‌లో ని తాజ్‌కృష్ణ హోటల్‌లో సమావేశం ఏర్పాటు చేసింది. అక్కడ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు, జడ్పీటీసీ సభ్యులతో మాట్లాడిన టీఆర్‌ఎస్ సీనియర్ నేత ఈటెల రాజేందర్.. చైర్మన్ అభ్యర్థి విషయంలో తుది నిర్ణయం కేసీఆర్‌దేనని స్పష్టంచేశారు. ఆ తర్వాత తాజ్‌కృష్ణలో జరిగిన మంతనాల వెనుక మతలబు ఏమిటి..? చివరకు జడ్పీ చైర్మన్ ఎవరవుతారు..? అన్న అంశాలు మాత్రం పార్టీవర్గాల్లో కలకలం రేపుతున్నాయి.Follow @sakshinews