జూన్ నాటికి జలకళ
⇒ ప్రతిష్టాత్మకంగా ‘మిషన్ కాకతీయ’
⇒ కడవతో నీళ్లు తోడుకునే పరిస్థితి రావాలి
⇒ చెరువుల దత్తతను ప్రోత్సహించండి
⇒ ప్రజాప్రతినిధుల భాగ స్వామ్యం తప్పనిసరి
⇒ భూసార పరీక్షలు, చెరువుల కబ్జాలపై సమన్వయంతో పనిచేయాలి
⇒ జెడ్పీ ప్రత్యేక సమావేశంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ‘మిషన్ కాకతీయ’ తొలిదశ వచ్చే జూన్ నాటికీ పూర్తవుతుందని భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చెరువుల పునరుద్ధరణ పారదర్శకంగా జరుగుతుందని తెలిపారు. టెండర్ల ప్రక్రియలో అక్రమాలకు తావివ్వకుండా ఈ-టెండర్ల విధానాన్ని అవలంబిస్తున్నట్లు పేర్కొన్నారు. శనివారం ‘మిషన్ కాకతీయ’పై జరిగిన జిల్లా పరిషత్ ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో చెరువుల మరమ్మతులపై సుదీర్ఘ చర్చ సాగింది. టెండర్లలో అధికార వికేంద్రీకరణ చేశామని, ప్రతి పైసాకు జవాబుదారీతనం ఉండేలా మార్గదర్శకాలను ఖరారు చేశామని తెలిపారు.
చెరువులు బాగుంటే ఊరు బాగుంటుందనే నినాదంలో ఈ కార్యక్రమంలో ప్రజలను భాగస్వామ్యులను చేస్తున్నట్లు వెల్లడించారు. సారవంతమైన పూడికను వినియోగించుకునేలా రైతులను ప్రోత్సహించాలని, ఆయా చెరువుల నాణ్యతను పరిశీలించేందుకు భూసార పరీక్షలు నిర్వహించాలని వ్యవసాయాధికారులను ఆదేశించారు. చెరువుల అభివృద్ధికి ముందుకొచ్చే దాతల పేర్లను ఆయా చెరువులకు పెడతామని తెలిపారు. దశలవారీగా చెరువులను పునరుద్ధరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇందులో రంగారెడ్డి జిల్లాలో 555 చెరువులకు మరమ్మతులు చేపడుతున్నట్లు చెప్పారు. సమైక్య రాష్ట్రంలో జిల్లా ఎస్‌ఈ కూడా లేరని, ఆంధ్ర పాలకుల ఏలుబడిలో జలవనరులు ఆక్రమణకు గురయ్యాయని పేర్కొన్నారు.
రెవెన్యూ సహకారంతో...
పట్టణ ప్రాంతాల్లో చెరువులు కబ్జాల పాలవుతున్నాయని, వీటిని అరికట్టేందుకు రెవెన్యూ సిబ్బంది భాగస్వామ్యం తప్పనిసరని అన్నారు. హద్దులు నిర్ధారణకు సర్వేలు చేపట్టాలని, ఇరిగేషన్ శాఖ యంత్రాంగంతో ఆక్రమణలు తొలగించాలని ఆదేశించారు. జలవనరులను కాపాడుకునేందుకు ఎఫ్‌టీఎల్ సూచించేలా చెట్లను నాటాలని అటవీశాఖ అధికారులకు సూచించారు. చెరువుల వల్ల అన్నివర్గాల ప్రజలకు మేలు కలుగుతుందని, పర్యావరణ పరిరక్షణకు ఉపయోగపడుతుందని తెలిపారు.
నీటి లభ్యత, చెరువు విస్తీర్ణం, ఆయకట్టును పరిగణనలోకి తీసుకొని ప్రాధాన్యతాక్రమంలో చెరువుల జాబితాను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఈ నెలాఖరులోపు గుర్తించిన చెరువుల టెండర్ల ఖరారును పూర్తి చేయాలని, జూన్ నాటికీ చెరువులకు జలకళ రావాలని అన్నారు. కడవలు, బిందెలతో నూతి నుంచి నీళ్లు తొడుకునే పాతకాలం పరిస్థితి వచ్చేలా చెరువుల పునరుద్ధరణను యజ్ఞంలా చేయాలని పిలుపునిచ్చారు.
అధికారులపై గరం!
ప్రతిపాదిత చెరువుల అంచనాల తయారీలో వెనుకపడిన మహేశ్వరం, రాజేంద్రనగర్, ఉప్పల్, ఘట్‌కేసర్ ఇంజినీరింగ్ అధికారులపై హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారుల ను ఉపేక్షించేది లేదన్నారు. పనిచేసే ఇంజినీర్లకు పదోన్నతులు కల్పిస్తామని, పనితీరు ప్రామాణికంగా బదిలీలు చేపడుతామని తెలి పారు. పనుల నాణ్యతా ప్రమాణాలను పరిశీ లించేందుకు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని, ఎస్‌ఈ స్థాయి అధికారికి ఈ బాధ్యత లు అప్పగించామని చెప్పారు. గుర్తించిన చెరువుల పునరుద్ధరణ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని, ప్రతి సమాచారాన్నీ వారితో పంచుకోవాలని సూచించారు.
అనంతరం ప్రజాప్రతినిధుల నుంచి చెరువుల పునరుద్ధరణపై నిర్మాణాత్మ క సలహాలు స్వీకరించారు. జెడ్పీ చైర్‌పర్సన్ సునీతామహేందర్‌రెడ్డి అధ్యక్షతన వహించిన ఈ సమావేశంలో మంత్రులు ఈటెల రాజేందర్, మహేందర్‌రెడ్డి, ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ప్రకాశ్‌గౌడ్, మంచి రెడ్డి కిషన్‌రెడ్డి, సంజీవరావు, రామ్మోహన్‌రెడ్డి, తీగల కృష్ణారెడ్డి, యాదయ్య, వివేక్‌గౌడ్, సుధీర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, నరేందర్‌రెడ్డి, కలెక్టర్ శ్రీధర్, పౌరసరఫరాల ముఖ్య కార్యదర్శి పార్థసారధి తదితరులు పాల్గొన్నారు.
దేశంలోనే అత్యధికంగా పింఛన్ ఇస్తున్న ఘనత మన ప్రభుత్వానిదేనని, అర్హులందరికీ పింఛన్లు ఇస్తామని హరీష్‌రావు స్పష్టంచేశారు. పింఛన్లను కట్ చేశామనే విపక్షాల ప్రచారం సరికాదని, రాజకీయాల మాట్లాడాలనుకుంటే మరో వేదిక ఉందని ఆహారభద్రత, పింఛన్లను ఏరివేశారనే ఆరోపణల నేపథ్యంలో వ్యాఖ్యానించారు.