జెడ్పీ టు జంగ్ | ZP to Jung | Sakshi
Sakshi News home page

జెడ్పీ టు జంగ్

Published Sun, Sep 7 2014 2:43 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

జెడ్పీ టు జంగ్ - Sakshi

జెడ్పీ టు జంగ్

 సాక్షిప్రతినిధి, నల్లగొండ :అధికార టీఆర్‌ఎస్, విపక్ష కాంగ్రెస్, సీపీఐ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.  జిల్లా అభివృద్ధి, సాగు,తాగునీటి ప్రాజెక్టులపై మొదలైన చర్చ, ప్రభుత్వాల మీదుగా, నేతల వ్యక్తిగత విషయాలు విమర్శించే దాకా వెళ్లింది.  గత నెల 27వ తేదీన నల్లగొండలో జరిగిన జిల్లాపరిషత్ సర్వసభ్య సమావేశంలో మొదలైన చర్చ, గడచిన పదిపన్నెండు రోజులుగా రోజుకో మలుపు తిరుగుతూ, వ్యక్తిగత అవినీతి ఆరోపణల వైపు పయనిస్తోంది. జిల్లా ప్రజలను దశాబ్దాలుగా ఊరిస్తున్న ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టు ఎట్టకేలకు అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కార్యరూపం దాల్చింది. రూ.1925కోట్ల అంచనావ్యయంతో పనులు మొదలయ్యాయి. వైఎస్సార్ మరణం తర్వాత సీఎంలుగా పనిచేసిన ఇద్దరూ ఈ ప్రాజెక్టుకు అరకొరగానే నిధులు విడుదల చేశారు.
 
 తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక, అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం పాత ప్రాజెక్టులను పక్కనపెట్టి, కొత్త ప్రాజెక్టులకు తెరమీదికి తెస్తోందని కాంగ్రెస్, సీపీఐ విమర్శలకు దిగాయి. జెడ్పీ సర్వసభ్య సమావేశంలో  సీపీఐ శాసనసభ పక్షనేత రవ్రీందకుమార్ ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ, జూరాల-పాకాల కోసం ఎస్‌ఎల్‌బీసీని పక్కన పెట్టొద్దని చర్చ లేవనెత్తారు. ఈ సందర్భంలో పనికిమాలిన ప్రాజెక్టులు  పక్కనపెడతాం, జూరాల-పాకాల సర్వే చేసి తీరుతామని స్పందించిన మంత్రి జగదీష్‌రెడ్డిపై ఒకవైపునుంచి కాంగ్రెస్, మరోవైపు నుంచి సీపీఐ ముప్పేట దాడి ప్రారంభించాయి.
 
 నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి రెండు పర్యాయాలు, ఎమ్మెల్యే రవీంద్రకుమార్ ఒకమారు విలేకరుల సమావేశాలు పెట్టి మరీ టీఆర్‌ఎస్‌పై విరుచుకుపడ్డారు. టీఆర్‌ఎస్ మంత్రులు జగదీష్‌రెడ్డి, నాయిని నర్సింహారెడ్డి జిల్లా కాంగ్రెస్ నేతలు ముఖ్యంగా టీసీఎల్పీ నేత జానారెడ్డి తదితరులపై విమర్శలు చేశారు. దీనికి ప్రతిగా, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు మంత్రులపై ఆరోపణలు చేశారు. మంత్రి జగదీష్‌రెడ్డి మరోమారు మేళ్లచెర్వులో మాజీమంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డిలపై ఒకింత ఘాటుగానే స్పందించారు. కాగా, ఎంపీ గుత్తా.. మంత్రి జగదీష్‌రెడ్డిపై వ్యక్తిగత ఆరోపణలకు తెరలేపారు. దీంతో కౌంటర్‌గా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి ఉమ్మడిగా శనివారం నల్లగొండలో విలేకరుల సమావేశం పెట్టిమరీ  ఎంపీ గుత్తాపై విమర్శల దాడికి దిగారు.  
 
 జిల్లాలోని ప్రాజెక్టుల గేట్లుఎత్తి మాచేతులు నొప్పి పుట్టాయి. టీఆర్‌ఎస్ నేతలు ఒక్కసారి గేట్లెత్తి మొనగాళ్లమనుకుంటే ఎలా..? జిల్లాకు సంబంధించిన ప్రాజెక్టులు, ఇతర అభివృద్ధి విషయాలపై ఏమీ తెలియకున్నా  తెలిసినట్టు నటి ంచొద్దు. జెడ్పీ సమావేశంలో ఎమ్మెల్యే రవీంద్రకుమార్ ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టు గురించి ప్రశ్నిస్తే.. పనికి మాలిన ప్రాజెక్టు, పక్కన పెట్టేస్తాం అని అనడం మంత్రి జగదీష్‌రెడ్డి అవగాహనరాహిత్యం.
 - ఈ నెల 5న నల్లగొండలో
 - ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి
 
 జిల్లాలో తాగు, సాగునీటి ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులో మంత్రుల (జగదీష్‌రెడ్డి, నాయిని నర్సింహారెడ్డి) వ్యాఖ్యలు వారి అవగాహనరాహిత్యానికి, అధికార దర్పానికి నిదర్శనం. సమస్యలకు పరిష్కారమార్గం చూడకుండా గత ప్రభుత్వంపై నెపంవేసి బాధ్యతల నుంచి తప్పుకోవాలని చూస్తున్నారు.
 - ఆగస్టు 28న మిర్యాలగూడలో
 
 ఫ్లోరైడ్ సమస్య తీరాలంటే...శ్రీశైలం సొరంగమార్గం (ఎస్‌ఎల్‌బీసీ), నక్కలగండి ప్రాజెక్టులు కీలకం. ఈ రెండింటినీ కాదని జూరాల-పాకాల ప్రాజెక్టు సర్వే చేయడం ఏంటి..?
 - ఆగస్టు 27న జరిగిన జెడ్పీ సమావేశంలో
 
 ఎస్‌ఎల్‌బీసీని పనికిమాలిన ప్రాజెక్టుగా అభివర్ణించడం తగదు. రూ.1925కోట్ల అంచనావ్యయంతో చేపట్టిన ఈప్రాజెక్టును నిర్వీర్యం చేసేందుకు జూరాల-పాకాల ప్రాజెక్టును  తెరమీదకు తెస్తున్నారు. మంత్రి జగదీష్‌రెడ్డికి  జిల్లా అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉంటే ఎస్‌ఎల్ బీసీకి నిధులు విడుదల చేయించాలి.
 - ఈ నెల 2న దేవరకొండలో
 - ఎమ్మెల్యే రవీంద్రకుమార్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement