ఆదిలాబాద్‌అర్బన్: ఉమ్మడి జిల్లా పరిధిలోని కొత్త మండలాల వారీగా మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలు (ఎంపీటీసీ), మండల ప్రజా పరిషత్ (ఎంపీపీ)ల సంఖ్య ఖరారు కావడంతో ‘జిల్లా పరిషత్’ ఎన్నికలకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఓటరు జాబితా, రిజర్వేషన్లు, ఎన్నికల నిర్వహణ వంటివి వెనువెంటనే చేపట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. మొన్నటి వరకు కొత్త జిల్లాలు, కొత్త మండలాల వారీగా జిల్లా, మండల పరిషత్‌లు ఏర్పాటు చేసిన అధికారులు తాజాగా ఎంపీటీసీల పునర్విభజనను సైతం పూర్తి చేశారు. ఉమ్మడి జిల్లాలో గతంలో 636 ఎంపీటీసీ స్థానాలుండగా ప్రస్తుతం 567కు తగ్గింది.
మున్సిపాలిటీల్లో సమీప పంచాయతీలను విలీనం చేయడంతో 69 ఎంపీటీసీ స్థానాల తగ్గింపునకు ఆస్కారం ఏర్పడింది. కొత్త మండలాల ప్రకారం ఎంపీటీసీ స్థానాలపై అభ్యంతరాలను అధికారులు ఈ నెల 22 వరకు స్వీకరించి 25న తుది జాబితా విడుదల చేశారు. ఆ జాబితాను జిల్లా యంత్రాంగం మంగళవారం ఉదయం ప్రభుత్వానికి పంపించింది. అయితే నాలుగు జిల్లాల పరిధిలో ప్రస్తుతం 567 ఎంపీటీసీ స్థానాలు, 67 ఎంపీపీలు, 67 జెడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు వీటికి మే నెలలో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు కసరత్తు మొదలుపెట్టారు.
మార్చిలో ఓటరు జాబితా తయారీ..
నూతన పంచాయతీరాజ్ చట్టానికి అనుగుణంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల సరిహద్దులు ఖరారవుతున్నాయి. నాలుగు జిల్లాల పరిధిలో 66 గ్రామీణ మండలాలను జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలుగా (అర్బన్ మండలాలు మినహా) పరిగణిస్తున్నారు. ఆ మేరకు నాలుగు జిల్లా పరిషత్‌లు, 66 మండల ప్రజాపరిషత్‌లు ఏర్పడుతున్నాయి. అయితే 2014 ఎన్నికల్లో గెలిచిన సభ్యుల పాలక వర్గాల పదవీకాలం ఈ ఏడాది జూలై 4తో ముగియనుంది. ఆలోగా స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించి కొత్త పాలకవర్గాలను సిద్ధంగా ఉంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం ఇది వరకే ప్రకటించారు.
ఈ నేపథ్యంలో మార్చి చివరిలోగా బూత్‌లు, వార్డులు, గ్రామాల వారీగా ఓటరు జాబితా సిద్ధం కానుంది. ఇది వరకే అసెంబ్లీ, సర్పంచ్ ఎన్నికలు జరిగిన నేపథ్యంలో ‘పరిషత్’ ఓటర్ల జాబితా తయారీకి మార్గం సులువైందని చెప్పవచ్చు. అయితే మరోమారు ఓటరు జాబితాలో సవరణలు చేసి తుది జాబితాను రూపొందించి మార్చి నెలాఖరులోగా ఓటరు ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం నుంచి అధికారులకు ఆదేశాలు అందాయి.
మార్చిలో రిజర్వేషన్లు..మేలో ఎన్నికలు?
నిర్దేశించుకున్న గడువులోగా జిల్లా, మండల పరిషత్‌లకు ఎన్నికలు జరపాలంటే ఆయా స్థానాలకు కేటాయించే రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ కీలకం. ప్రభుత్వ అనుమతి, ప్రస్తుతం జరుగుతున్న హడావుడిని చూస్తే మార్చిలో ఆయా స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం చూస్తే ఉమ్మడి జిల్లాలోని 1,725 గ్రామీణ ప్రాంతాల్లోని హ్యాబిటేషన్లలో 19,80,980 మంది జనాభా ఉంది. ఇందులో పురుషులు 9,85,303 మంది ఉండగా, మహిళలు 9,95,677 మంది ఉన్నారు. కొత్త పీఆర్ చట్టానికి అనుగుణంగా, 2011 జనాభా లెక్కల ప్రకారం జెడ్పీటీసీ, ఎంపీటీసీల రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు.
మొన్న జరిగిన ఎంపీటీసీల పునర్విభజనలో 3,500 నుంచి 4 వేలలోపు జనాభా కలిగి ఉంటే ఒక ఎంపీటీసీ స్థానంగా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇక పీఆర్ మండలాల ప్రకారం ఎంపీపీ, జెడ్పీటీసీలు ఉంటారు. ఈ సారి ఖరారయ్యే రిజర్వేషన్ పదేళ్ల పాటు కొనసాగనుంది. ఈ ప్రక్రియనంతటినీ లోక్‌సభ ఎన్నికల్లోగా పూర్తి చేయాలని యోచిస్తున్నారు. ఇదిలా ఉండగా, లోక్‌సభ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయన్న దాన్ని బట్టి జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. సమయానుకూలంగా మే నెల రెండో వారంలో లోక్‌సభ ఎన్నికలు ముగిస్తే.. మే నెలాఖరులో లేదా జూన్ మొదటి, రెండో వారంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు అనువుగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment