సానియా మీర్జా
న్యూఢిల్లీ: కుడి మోకాలి గాయం వల్ల గత అక్టోబర్ నుంచి ఆటకు దూరమైన భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మరో మూడు నెలల్లో రాకెట్ పట్టుకునే అవకాశం ఉంది. మే నెలాఖర్లో జరిగే ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీకల్లా కోలుకుంటానని ఈ హైదరాబాద్ క్రీడాకారిణి ఆశాభావంతో ఉంది. మహిళల టెన్నిస్‌ను సెరెనా సహా ఏ ఒక్కరూ ఎక్కువ కాలం శాసించలేరని చెప్పింది. యువ ప్రతిభావంతులు టాప్ ర్యాంకర్లను కంగుతినిపిస్తున్న సంగతి మరవొద్దని సూచించింది. ఫెడ్ కప్ టీమ్ టోర్నమెంట్‌లో భారత యువతార అంకితా రైనా ప్రదర్శన అద్భుతంగా ఉందని సానియా కితాబిచ్చింది.
‘ఫెడ్ కప్‌లో ఈసారి యువ క్రీడాకారిణుల పోరాటపటిమ ఆకట్టుకుంది. కానీ తదుపరి దశకు చేరకపోవడమే నిరాశను కలిగిస్తోంది. ఆ వెలితి ఇంకా కొనసాగుతోంది’ అని హైదరాబాదీ స్టార్ చెప్పింది. ఫెడ్ కప్‌లో అంకిత ఆటతీరు అసాధారణమని పేర్కొంది. తనకన్నా ఎంతో మెరుగైనా, టాప్– 100 ర్యాంకర్లను ఆమె కంగుతినిపించిన తీరు గొప్ప పురోగతి అని ప్రశంసించింది. అంకితను తదుపరి భావి సానియాగా భావించవచ్చా అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ... చాన్నాళ్లుగా ఎంతో మంది ఈ ప్రశ్న అడుగుతున్నారు. అయితే వీళ్లందరికీ చెబుతున్నా... ఎందుకు మనం సానియా దగ్గరే ఆగిపోవాలి. నన్ను మించి మేటి క్రీడాకారిణిగా ఎదగాలని ఆశిద్దాం’ అని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment