పదిరోజుల పసికందుపై ఎలుకల దాడి
గుంటూరు: గుంటూరు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో బుధవారం దారుణం చోటు చేసుకుంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పసికందుపై ఎలుకలు దాడి చేసి వేళ్లను, ఎడమ కన్నును కొరుక్కుతిన్నాయి. దీంతో పది రోజుల ఆ చిన్నారి మృతిచెందాడు. ఇదేమని ప్రశ్నించగా వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారని బాధితులు తెలిపారు. వివరాలు విజయవాడ కృష్ణలంకకు చెందిన చావలి నాగ, లక్ష్మి దంపతులకు రెండేళ్ల కుమారుడు ఉన్నాడు.
విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో రెండో కాన్పులో ఈ నెల 17వ తేదీన లక్ష్మి మగ శిశువుకు జన్మనిచ్చింది. శిశువు అనారోగ్యంగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్సకు వచ్చింది. అప్పటి నుంచి శిశువుకు పీడియాట్రిక్ సర్జరీ విభాగంలో చికిత్స అందిస్తున్నారు. వారం రోజుల క్రితం శిశువుపై ఎలుకలు దాడి చేశాయి. దీనిపై తల్లిదండ్రులు వైద్యులకు ఫిర్యాదు చేశారు. అయినా సిబ్బంది, వైద్యులు ఎలాంటి చర్యలు చేపట్టలేదు.
అయితే తాజా మంగళవారం రాత్రి శిశువు కాలి, చేతి వేళ్లతో పాటు ఎడమ కన్నును ఎలుకలు కొరికేశాయి. ముఖంపై తీవ్రంగా గాయపరిచాయి. బుధవారం ఉదయం గమనించిన నాగ, లక్ష్మి దంపతులు వైద్యాధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై వారు చర్యలు తీసుకోలేదు. పెపైచ్చు...'నీకు ఇంకో కుమారుడు ఉన్నాడు కదా...ఎందుకు బాధపడుతున్నావని' సమాధానమిచ్చారు.
కాగా, పరిస్థితి విషమించడంతో మధ్యాహ్నం ఆ పసికందు మరణించాడు. ఆసుపత్రి సిబ్బంది వైఖరి వల్లే తమ బిడ్డను కోల్పోయామని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఆస్పత్రిలో ఎలుకల బెడద ఎక్కువగా ఉందని, గతంలో కూడా నలుగురు చిన్నారులు ఎలుగుల దాడిలో గాయపడ్డారని పేషంట్లు చెబుతున్నారు. అయితే సిబ్బంది మాత్రం పట్టించుకోలేదని వారు తెలిపారు.