స్కూలుకు రాలేదని.. గుండు గీశారు..
బెంగళూరు: స్కూలుకు రాలేదని.. 12 మంది విద్యార్ధులకు గుండు గీసిన సంఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. నగరంలోని విటల్ మాలియా రోడ్డులో ఉన్న ఓ ప్రైవేటు స్కూల్లో ఈ ఘటన జరిగింది. స్కూల్లోని 9,10వ తరగతి విద్యార్థులను వార్డెన్ ఇలా శిక్షించినట్టు సమాచారం. హాస్టల్ వార్డెన్ కిరణ్ పిల్లలకు తలలో చుండ్రు ఉందనే గుండు గీయించిట్టు చెబుతున్నారు. విద్యార్థులందరితో పాటు వార్డెన్ను కూడా విచారించామని, చట్టబద్ధంగా ముందుకెళ్లామని కబ్బన్ పార్క్ డీసీపీ సందీప్ పాటిల్ తెలిపారు.
అయితే పిల్లల తల్లిదండ్రులు మాత్రం దీనిపై మండిపడుతున్నారు. 'మా అబ్బాయి తరగతులకు హాజరు కాలేదని ఒకరోజంతా గ్రౌండ్లో నిలబెట్టి ఉంచారు. ఒక రోజు తరగతికి హాజరు కాకపోతేనే శిక్షించారు. మరుసటి రోజు స్కూలుకు వెళ్లి చూస్తే మా అబ్బాయి తల మీద జుట్టు లేకపోవడం చూసి ఆశ్చర్యపోయాం' అని ఓ బాలుడి తండ్రి పేర్కొన్నారు. స్కూల్లో మొత్తం 12 మంది విద్యార్థులకు గుండు గీయించారు. విద్యార్థులు గత వారంలో తరగతులకు హాజరు కాలేదని.. దీనికి సంబంధించి ఆ వారంలోనే అధికారులు దండనలు విధించారని పోలీసులు తెలిపారు.