దళిత యువకుడు వర్రి శ్రీకాంత్‌కి గుండు గీయిస్తున్న దృశ్యం
సాక్షి, విశాఖపట్నం: పవన్ కల్యాణ్ వీరాభిమాని అలియాస్ బిగ్‌బాస్ ఫేం అలియాస్ సినీ దర్శక నిర్మాత.. వీటన్నింటికీ మించి వివాదాస్పద వ్యక్తిగా ఉన్న నూతన్ నాయుడు ఇంట్లో జరిగిన దురాగతం కేసులో సెల్‌ఫోన్ వీడియో కాల్ కీలకం కానుంది. నూతన్‌నాయుడు ఇంట్లో పనిచేసి మానివేసిన దళిత యువకుడు వర్రి శ్రీకాంత్‌ను సెల్‌ఫోన్ పోయిందనే నెపంతో ఇంటికి పిలిపించి శిరోముండనం చేయడంతో పాటు దారుణంగా హింసించిన ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన 24 గంటల వ్యవధిలోనే నూతన్ భార్యతో సహా ఏడుగురిని అరెస్టు చేసిన పోలీసులు ఇప్పుడు కేసు విచారణను వేగవంతం చేశారు. శ్రీకాంత్‌పై చేసిన అకృత్యాలను సెల్ఫీలు తీసి పైశాచిక ఆనందం పొందిన నిందితులు అక్కడితో ఆగకుండా వీడియోలు తీసి ఎవరికైనా పంపించారా? అన్న అనుమానాలను పోలీసు అధికారులు వ్యక్తం చేస్తున్నారు. (శిరోముండనం కేసులో నిందితులకు రిమాండ్)
ఆ ఘటన సమయంలో ఎవరికైనా వీడియో కాల్ చేశారా.. శిరోముండనం, దాడి దృశ్యాలను ఎవరికైనా పంపించారా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో దాడి దృశ్యాలను చిత్రీకరించిన సెల్‌ఫోన్ ఇప్పుడు కీలకం కానుంది. అయితే వీడియో షూట్ చేసిన తర్వాత నిందితురాలు బ్యూటీషియన్ ఇందిరారాణి సెల్ ఫోన్‌లోని దృశ్యాలను వెంటనే తొలగించేశారు. ఈ నేపథ్యంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి తిరిగి సమాచారాన్ని పొందేందుకు పోలీసులు సదరు సెల్‌ఫోన్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక వస్తే నిందితులు ఆ ఘటన సమయంలో వీడియో కాల్ ఎవరికైనా చేశారా.. దాడి దృశ్యాలను ఎవరికైనా ఫార్వార్డ్ చేశారా... అన్న విషయాల్లో స్పష్టత వస్తుందని పోలీసు అధికారులు చెబుతున్నారు. (శిరోముండనం : దోషులకు కఠిన శిక్ష తప్పదు)
అసలు ఆ ఇంట్లో ఏం జరుగుతోంది?
ప్రస్తుతం నూతన్ నాయుడు చేస్తున్న వ్యాపారాలు ఏమిటి... అసలు ఇంట్లో అంత మంది పని వాళ్లను పెట్టుకోవాల్సిన అవసరం ఏమిటన్న కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఎంతమంది పని వాళ్లనైనా పెట్టుకోవడమనేది... ఎవరి వ్యక్తిగత హోదా, ఆర్థిక స్థాయిని బట్టి ఉంటుంది కానీ.. ఏకంగా బ్యుటీషియన్, సూపర్ వైజర్‌లు సహా ఐదుగురు పనివాళ్లను పెట్టుకున్న వ్యవహారంపై పోలీసులు కాపీ లాగుతున్నారు.(శిరోముండనం కేసులో నిందితులకు 2 వారాల రిమాండ్)
Comments
Please login to add a commentAdd a comment