ఉత్తర భారతాన్ని వణికిస్తున్న వరదలు
న్యూఢిల్లీ: భారీ వరదలు ఉత్తర భారతాన్ని వణికిస్తున్నాయి. భారీ వర్షాలకు తోడు నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో పలు రాష్ట్రాల్లోని ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. వరద ఉధృతి పెరుగుతుండటం క్షణక్షణం ఉత్కంఠ రేపుతోంది. దీంతో అధికారులు ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు.
బిహార్‌లో భారీ వరదలు ముంచెత్తుతున్నాయి. సితామర్హి జిల్లాలో బాగ్‌మతి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో అసాధారణ వరద పరిస్థితులు నెలకొన్నాయని అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. ఇక గోపాల్‌గంజ్ జిల్లాలోనూ గందక్ నది ఉధృతంగా ప్రవహిస్తూ ఆందోళనకు గురిచేస్తోంది. బిహార్‌లో మొత్తం 12 జిల్లాలు వరదల వల్ల ప్రభావితం అయ్యాయని, ఇప్పటికే 10 ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు రంగంలోకి దిగగా, మరో బృందాలు సోమవారం రాష్ట్రానికి రానున్నాయని అధికారులు తెలిపారు.
ఉత్తరప్రదేశ్‌లోని బల్‌రాంపూర్‌లో రాప్తి నది, బుదౌన్‌లో గంగా నది ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో వరద ముప్పు పొంచి ఉందని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్డీఎంఏ) ప్రకటించింది. హిమాలయ రాష్ట్రమైన అసోంలోనూ బ్రహ్మపుత్ర, ఇతర నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో భారీ వరదలు సంభవించాయి.
నిలిచిపోయిన మానస సరోవరం యాత్ర
కాళీ నది ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తుండటంతో ఉత్తరాఖండ్‌లో కైలాస్ మానవ సరోవరం యాత్ర నిలిచిపోయింది. కాళీ నది వరదల ఉధృతికి మంగ్తిలో రెండు వంతెనలు, సింఖోలాలో ఒక వంతెన దెబ్బతిన్నాయి. ఐలాగాడ్‌లో రోడ్డుపై రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో మానస సరోవర్ యాత్రకు వెళ్లిన పలువురు యాత్రికులు తప్పిపోయారు. ఇందులో నలుగురి మృతదేహాలను మానస సరోవరం యాత్రమార్గమైన మల్పా వద్ద స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ నాలుగు దుకాణాలు వరదల కారణంగా దెబ్బతిన్నాయి. అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు.