
పాట్నా: బిహార్‌లో వంతెనలు వరుసగా కూలిపోతున్నాయి. వర్షాలు, వరదలు కారణంగా గత 10 రోజుల్లో రాష్ట్రంలో ఇప్పటికే మూడు వంతెనలు కుంగిపోవడం, కూలిపోవడం జరగ్గా.. తాజాగా మరో వంతెన ప్రమాదానికి గురైంది. తాజాగా కిషన్‌గంజ్ జిల్లాలో కంకయీ ఉపనదిపై నిర్మించిన ఓ వంతెన కుంగిపోయింది.
దీంతో బహదుర్‌గంజ్, దిఘాల్‌బ్యాంక్ బ్లాక్‌ల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. బ్రిడ్జికి ఇరువైపులా బారికేడ్లను ఏర్పాటు చేసి, రాకపోకలను నిలిపివేసినట్లు చెప్పారు. రహదారుల శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
‘కంకయీ, మహానంద నదులను కలిపే మడియా ఉపనదిపై 2011లో 70 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పుతో ఈ వంతెనను నిర్మించారు. నేపాల్‌లోని పరీవాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో నదిలో నీటి మట్టం ఒక్కసారిగా పెరిగింది. ప్రవాహం ధాటికి వంతెన పిల్లర్లు కుంగిపోయాయి. ఇదిలా ఉండగా అంతకుముందు తూర్పు చంపారన్, సివాన్, అరారియా జిల్లాల్లో వంతెన సంబంధిత ఘటనలు చోటుచేసుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment