ప్రాణాలు తీస్తున్న సైట్లు!
బెంగళూరులో ఓ కార్పొరేట్ పాఠశాలలో చదివే 14 ఏళ్ల అమ్మాయికి రెండు నెలల క్రితం నగరానికి చెందిన మనోజ్ అనే యువకుడు ఫేస్‌బుక్‌లో పరిచయమయ్యాడు. ఇక రోజూ గంటల కొద్దీ చాటింగ్. అది వారి మధ్య ప్రేమకు దారి తీసింది. కొద్ది రోజులకు వారు శారీరకంగా కూడా దగ్గరయ్యారు. ఇలా కొన్ని రోజులు గడిచాయి. మోజు తీరాక మనోజ్ ముఖం చాటేస్తూ వచ్చాడు. ఏమని ప్రశ్నిస్తే ‘నేనిదంతా సరదా కోసం చేశా’ అని అన్నాడు.
ఇంకేముంది నిస్పృహకు గురైన ఆ అమ్మాయి తన మెడకు ఉరి బిగించుకుంది. తల్లిదండ్రుల మనసుల్లో మానని గాయాన్ని రేపి తనువు చాలించింది. తనకు జరిగిన మోసాన్ని స్వయంగా ఆ అమ్మాయి తన సూసైడ్ నోట్‌లో వెల్లడించింది. బుధవారం నగరంలో జరిగిన ఈ సంఘటన.. తమ పిల్లలు సోషల్ నెట్‌వర్కింగ్స్ వాడకంపై తల్లిదండ్రుల పర్యవేక్షణ అవసరమని హెచ్చరిస్తోంది.
సమాచార, సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతున్న సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లు యువత పాలిట యమపాశలవుతున్నాయి! అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక సాంకేతికత కారణంగా ప్రస్తుతం నగరాల్లోని ఎల్‌కేజీ విద్యార్థులు సైతం కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లపై వేళ్లను టకటకలాడిస్తున్నారు.
పాఠ్యాంశాలను తిరగేస్తారో లేదో కానీ ఫేస్‌బుక్‌లో అకౌంట్‌ని మాత్రం కచ్చితంగా ఫాలో అవుతుంటారు. ఈ విధానం చాలా సందర్భాల్లో ఎన్నో ఆన్‌లైన్ విజయాలకు, మరుగున పడిన నైపుణ్యాలను ప్రపంచానికి చాటి చెప్పేందుకు పనికి వస్తుంటే... మరి కొన్ని సందర్భాల్లో యువత ప్రాణాలను బలిగొంటోంది.
పర్యవేక్షణ లోపం...
ప్రస్తుతం నగరాల్లో చాలా మంది తల్లిదండ్రులు ఉద్యోగులుగా ఉంటున్నారు. దీంతో ఎప్పుడో పొద్దున వారు ఇంటినుంచి బయటపడితే తిరిగి ఏ రాత్రికో ఇంటికి చేరుతున్నారు. ఆ సమయంలో కూడా పని ఒత్తిళ్ల వల్ల, తాము లేని సమయంలో పిల్లలు ఏమి చేస్తున్నారు అనే విషయాలపై సక్రమంగా దృష్టి సారించలేకపోతున్నారని బెంగళూరుకు చెందిన మానసిక చికిత్స నిపుణురాలు నైనా వివరించారు. ఈ కారణంగానే పాఠశాలల్లో చదివే చిన్నారులు సైతం ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సోషన్ నెట్‌వర్కింగ్ సైట్‌లలో ఎక్కువ సమయాన్ని గడిపేస్తున్నారని పేర్కొన్నారు.
ఎన్ని ఒత్తిళ్లలో ఉన్నా... తాము లేని సందర్భంలో చిన్నారులు ఏం చేస్తున్నారు అనే విషయాన్ని ప్రతి తల్లిదండ్రి గమనించి తీరాలని సూచించారు. ఒక వేళ పిల్లల ప్రవర్తనలో మార్పులు కనిపిస్తే అందుకు సంబంధించిన కారణాలను అన్వేషించాలని అన్నారు. పిల్లలు ఎక్కువ సమయాన్ని సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లలో గడిపేస్తుంటే... దానివల్ల కలిగే నష్టాలను వారికి వివరించడం ద్వారా వారిని సరైన మార్గంలో నడిపించేందుకు వీలవుతుందని తెలిపారు.
సైబర్ ఎడ్యుకేషన్ తప్పనిసరి కావాలి...
అందుబాటులోకి వచ్చిన ఆధునిక టెక్నాలజీ గురించి మాత్రమే కాక దానిని సరిగా వినియోగించుకోకపోతే కలిగే నష్టాలను కూడా పిల్లలకు పాఠశాలల్లో నేర్పాల్సిన అవసరం ఉందని, సైబర్ ఎడ్యుకేషన్‌ను కూడా సిలబస్‌లో చేర్చాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని సైబర్ వ్యవహారాల నిపుణులు మీరా చెబుతున్నారు. సైబర్ వ్యవహారాల్లో పాటించాల్సిన జాగ్రత్తలు తదితరాలను పిల్లలకు ఎప్పటికప్పుడు చెబుతూ ఉండాలని తెలిపారు.
‘18 ఏళ్ల వరకు పిల్లలు చాలా సున్నితమైన మనసుతో ఉంటారు. ఆ వయసులో వాళ్లు సోషల్ నెట్‌వర్క్‌లను ఉపయోగించకపోవడమే ఎంతో మంచిది. అలా కాదని ఒక వేళ కంప్యూటర్‌కు సంబంధించిన పరిజ్ఞానాన్ని పరిచయం చేయడంలో భాగంగా సోషల్ నెట్‌వర్క్‌ల గురించి కూడా చెప్పాల్సి వస్తే అందులో పాటించాల్సిన నియమాలను కూడా పాఠశాలు కచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది’ అని చెప్పారు.
జీవితాలను అంధకారం చేసిన ‘నెట్’
బెంగళూరుకు చెందిన మాలిని(23) నగరంలోని ఓ ప్రైవేటు సంస్థలో పనిచేసేది. ఫేస్‌బుక్ ద్వారా తనకు పరిచయమైన వ్యక్తితో స్నేహాన్ని పెంచుకొంది. ఆరు నెలల పాటు అతనితో స్నేహం చేసింది. అదే ప్రేమగా మారింది. అంతలో ఆ వ్యక్తి మాట మార్చాడు. ‘మా ఇంట్లో ఇదంతా తెలిస్తే పెద్ద గొడవవుతుంది. మన స్నేహాన్ని ఇంతటితో ఆపేద్దాం. ఇంకెప్పుడూ మనం కలవలేం’ అని ఫేస్‌బుక్‌లో మెసేజ్ పోస్ట్ చేశాడు. ఇంకేముంది ఆ విషయాన్ని జీర్ణించుకోలేని మాలిని సెప్టెంబర్ 21, 2012న తాను ఉంటున్న హాస్టల్ గదిలో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది.
బెంగళూరులోని ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థలో శ్రీరాజ్(24) సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేసేవాడు. ఫేస్‌బుక్‌లో ఓ అమ్మాయితో సరదాగా చాటింగ్ చేయడం ప్రారంభించాడు. అది కాస్తా స్నేహం, ప్రేమకు దారితీసింది. కొంత కాలం తర్వాత తనకు ఫేస్‌బుక్‌లో పరిచయమైన అమ్మాయిని ప్రత్యక్షంగా కలవాలనుకున్నాడు. తీరా ఆ అమ్మాయిని కలుసుకున్న తర్వాత ఫేస్‌బుక్‌లో ఆమె పొందుపరిచిన ఫొటో ఫేక్ ఫొటో అని అర్థమయింది. తాను ఎంతగానో నమ్మిన అమ్మాయి తనను మోసం చేసిందని భావించిన శ్రీరాజ్... మే 22, 2012న విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.