పెళ్లి పేరుతో దుర్మార్గం
సాక్షి ప్రతినిధి, చెన్నై: పేదరికంతో ఇద్దరు కూతుర్ల పెళ్లిళ్లు ఎలా చేయాలనుకుంటున్న ఆ దంపతుల బలహీనతను ఆసరా చేసుకుని 16 ఏళ్ల బాలికను చెరబట్టిన దుర్మార్గుడి ఉదంతమిది. పెళ్లి పేరుతో 16 ఏళ్ల బాలికను గృహనిర్బంధానికి గురిచేసి నెలరోజులకుపైగా అత్యాచారానికి పాల్పడిన మృగాడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. గురువారం వెలుగులోకి వచ్చిన ఈ దారుణం వివరాలు ఇలా ఉన్నాయి.
తమిళనాడు కన్యాకుమారి జిల్లా నాగర్‌కోవిల్ కురుసాడి ప్రాంతానికి చెందిన రాబర్ట్ బెల్లార్మిన్ (42) పరోటా మాస్టర్. నాగర్‌కోవిల్ సమీపం పల్లందురై ప్రాంతానికి చెందిన రాబర్ట్‌కు పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్నారు. మనస్పర్థల కారణంగా రాబర్ట్ భార్యతో విడిపోయాడు. రెండోపెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న రాబర్ట్ తంజావూరు నాంజికోట్టై రోడ్డుకు చెందిన పేద దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నట్లు తెలుసుకున్నాడు. వీరిలో 16 ఏళ్ల పెద్ద కుమార్తె పదో తరగతి చదువుపూర్తి చేయగా పెళ్లి చేసేందుకు వరుడు కోసం వెతుకుతున్నారు. తనకిచ్చి పెళ్లి చేస్తే అప్పులు తీర్చడంతోపాటు రూ.లక్ష నగదు ఇస్తానని బాలిక తల్లిదండ్రులను ప్రలోభపెట్టాడు.
డబ్బుకు ఆశపడి గత నెల 10వ తేదీన కులశేఖరలోని ఒక ఆలయం బయట ఇరువురి చేత మాలలు మాత్రమే మార్పించి పెళ్లి అయిందనిపించారు. అదే ప్రాంతంలో ఇల్లు తీసుకున్న రాబర్ట్ కాపురం చేయాల్సిందిగా సదరు బాలికను వేధించడం ప్రారంభించాడు. తనతో సన్నిహితంగా ఉంటేనే తల్లితండ్రులకు డబ్బు ఇస్తానంటూ బాలికను బెదిరిస్తూ అత్యాచారానికి పాల్పడేవాడు. రాబర్ట్ తీరును అనుమానించిన స్థానికులు చైల్డ్‌లైన్ సంస్థకు సమాచారం ఇచ్చారు. చైల్డ్‌లైన్ సిబ్బంది స్థానిక పోలీసులను వెంటపెట్టుకుని గురువారం సదరు ఇంటికి చేరుకున్నారు. పోలీసులను చూడగానే బాలిక కన్నీళ్లపర్యంతమైంది. మహిళా పోలీసుస్టేషన్‌కు ఆ బాలికను తరలించి విచారించగా తన దీనగాథను చెప్పుకుని బావురుమంది. బాధిత బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాబర్ట్ కోసం గాలిస్తున్నారు.