కన్యాకుమారిలో అమిత్ షా ఇంటింటి ప్రచారం
సాక్షి, చెన్నై: తమిళనాడులో అన్నాడీఎంకే–బీజేపీ కూటమి అధికారంలోకి రావడం ఖాయమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా నాగర్‌కోయిల్‌లో ఆయన రోడ్ షోతో ఓటర్లను ఆకర్షించే యత్నం చేశారు. కన్యాకుమారి లోక్‌సభ ఉప ఎన్నికల్లో పోటీచేస్తున్న బీజేపీ అభ్యర్థి పొన్ రాధాకృష్ణన్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న కూటమి అభ్యర్థులకు మద్దతుగా విజయ సంకల్ప యాత్ర నిమిత్తం ఆదివారం నాగర్ కోయిల్‌లో అమిత్ షా పర్యటన సాగింది. ఉదయం తిరువనంతపురం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో నాగర్‌కోయిల్ చేరుకున్న ఆయన అక్కడి సుశీంద్రం ధనుమలై పెరుమాల్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడ ఇంటింటికీ వెళ్లి కరపత్రాలను పంపిణీ చేశారు.
నాగర్‌కోయిల్ భగవతి అమ్మన్ ఆలయంలో పూజల అనంతరం, రోడ్‌షోతో ముందుకు సాగారు. ఓపెన్ టాప్ వాహనంలో అమిత్ షా పర్యటన సాగింది. పొన్ రాధాకృష్ణన్‌ను గెలిపించాలని ఓటర్లకు విన్నవించారు. రోడ్ షో తర్వాత ఓ హోటల్‌లో బీజేపీ వర్గాలతో సమావేశం అయ్యారు. అనంతరం మీడియాతో అమిత్ షా మాట్లాడుతూ కన్యాకుమారి పార్లమెంట్, తమిళనాడు అసెంబ్లీని అన్నాడీఎంకే–బీజేపీ కూటమి గెలుచుకోవడం ఖాయ మన్నారు. రోడ్‌షోలో వేపముడు కూడలిలో ఉన్న దివంగత కాంగ్రెస్ సీఎం కామరాజర్ విగ్రహానికి అమిత్ షా పూలమాలలు వేసి నివాళులర్పించారు. మధ్యాహ్నం నాగర్ కోయిల్ పర్యటన ముగించుకుని మళ్లీ తిరువనంతపురానికి వెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment