చిన్నారి మాన్వీ.. విషాదాంతం
హైదరాబాద్, న్యూస్‌లైన్: కన్నతండ్రి చేతుల్లోంచి జారి మూసీ నదిలో పడి గల్లంతైన చిన్నారి మాన్వీ విగతజీవిగా లభించింది. ఆమె మృతదేహం శుక్రవారం మధ్యాహ్నం లభించింది. దీంతో 24 గంటల నిరీక్షణకు తెరపడింది. ఇక్కడి హయత్‌నగర్ మండలం మర్రిపల్లి వద్ద నదిలోని చెట్ల పొదల్లో మృతదేహం ఇరుక్కుని ఉండగా నేషనల్ డిజాస్టర్ రెస్క్యూ ఫోర్స్(ఎన్‌డీఆర్‌ఎఫ్) సహకారంతో పోలీసులు గుర్తించి వెలికితీశారు. అనంతరం పోస్టుమార్టం నిర్వహించాక మృతదేహాన్ని సంబంధీకులకు అప్పగించారు.
తీవ్ర మనోవేదన మధ్య బంధువులు మాన్వీ మృతదేహానికి మన్సూరాబాద్‌లోని పెద్దచెరువు స్మశానవాటికలో శుక్రవారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. హైదరాబాద్‌లోని మన్సూరాబాద్ సహారా ఎస్టేట్‌కు చెందిన ప్రవాస భారతీయ వైద్యుడు మేఘశ్యామరెడ్డి గురువారం ఉదయం తన కుమారుడు ప్రమోద్‌రెడ్డి, కుమార్తె మాన్వీతో కలిసి మూసీ నదిని చూసేందుకు నాగోలు వద్దకు వెళ్లగా.. తండ్రి భుజాలపై ఉన్న చిన్నారి మాన్వీ మూసీలో పడిపోవడం తెలిసిందే. చిన్నారికోసం ఎల్బీనగర్ పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో గురువారం రాత్రి వరకు గాలించినా ఆచూకీ లభించలేదు.
దీంతో దుర్గంచెరువులో ఉండే పర్యాటకశాఖ బోట్లను తీసుకొచ్చి ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది సహకారంతో పోలీసులు శుక్రవారం ఉదయం ఆరుగంటలకే గాలింపు చేపట్టారు. మాన్వీ మేనమామతో కలిసి మూసీ దిగువకు 8 కిలోమీటర్ల వరకు వెళ్లారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో హయత్‌నగర్ మండలం మర్రిపల్లి గ్రామం సమీపంలోని చెక్‌డ్యామ్ వరకు గాలిస్తూ వెళ్లారు. డ్యామ్ సమీపంలో వెతికినా ప్రయోజనం లేకపోవడంతో మళ్లీ ఎగువ వరకు గాలించాలనే ఉద్దేశంతో తిరిగి వెతకడం మొదలుపెట్టారు.
ఆ సమీపంలోని చెట్ల పొదల్లో తీవ్రగాయాలతో ఉన్న మాన్వీ మృతదేహం లభించింది. వెంటనే మృతదేహాన్ని బోటులో నాగోలు బ్రిడ్జి వద్దకు తీసుకొచ్చి అక్కడ్నుంచి ఆటోలో ఉస్మానియా ఆసుపత్రికి పోస్టుమార్టంకోసం తరలించారు. నీటి ప్రవాహంలో కొట్టుకుపోయినందున నదిలోని రాళ్లు, ముళ్లకంచెల కారణంగా గాయాలయ్యాయని నిర్ధారించారు. అనంతరం పోలీసులు మృతదేహాన్ని సంబంధీకులకు అప్పగించగా.. సహారా ఎస్టేట్‌కు తరలించారు. మాన్వీ మరణవార్తతో సహారా ఎస్టేట్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి.
తీవ్ర వేదనలో మాన్వీ కుటుంబం..
మాన్వీ గల్లంతు వార్త తెలియడంతో అనేకమంది శుక్రవారం ఉదయం నాగోలు మూసీ నది వంతెన, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లోకి చేరుకుని తీవ్ర ఉత్కంఠతో ఎదురు చూశారు. ఈ కారణంగా పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అయితే మాన్వీ మరణవార్త తెలుసుకున్న ప్రజలు తీవ్ర ఆవేదన, చెమర్చిన కళ్లతో తిరిగివెళ్లారు. మరోవైపు మాన్వీ మృతదేహాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున కాలనీవాసులు, బంధువులు సహారా ఎస్టేట్‌కు తరలివచ్చారు. మాన్వీ తాత బాల్‌రెడ్డి సహారా ఎస్టేట్ సీనియర్ సిటిజన్ సంఘం అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. అందరితో కలివిడిగా వ్యవహరించే ఆయన ఇంట్లో విషాదం చోటుచేసుకోవడం సహారా ఎస్టేట్‌వాసులను కలచివేసింది. సెలవుల్ని సరదాగా గడపటానికి మాతృదేశం వస్తే... కుమార్తెను పోగొట్టుకోవాల్సి వచ్చిందంటూ గుండెపగిలేలా రోదిస్తున్న తండ్రి మేఘశ్యామరెడ్డిని ఓదార్చడం ఎవరివల్లా కాలేదు.