
సరిహద్దుల వద్ద ఆయుధాలతో మిలిటెంట్లు
శ్రీనగర్: భారత సరిహద్దుల వద్ద 200 మంది మిలిటెంట్లు పెద్ద ఎత్తున ఆయుధాలతో దాడి చేయడానికి పొంచి ఉన్నారని భారత సైన్యం ప్రకటించింది. వారికి వీలు దొరికితే కాశ్మీర్ లోయలోకి చొరబడేందుకు సిద్ధంగా ఉన్నట్లు లెఫ్టెనెంట్ జనరల్ సుబ్రతా సాహా తెలిపారు. కాశ్మీర్ లో తాజాగా సంభవించిన వరదలను అవకాశం తీసుకుని వారు ఆ ప్రాంతంలోకి చొరబడేందుకు యత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే భారత ఆర్మీ వారి ప్రయత్నాలను దాదాపుగా తిప్పికొట్టిందని ఆయన స్పష్టం చేశారు.
ఈ మధ్యనే విదేశీ టెర్రరిస్టు ఉమర్ భట్ ను హతమార్చిన విషయాన్ని ఈ సందర్భంగా సాహా తెలిపారు. గత పదిరోజుల నుంచి వేర్వేరు ప్రాంతాల్లో ఐదుగురి మిలిటెంట్లను హతమార్చినట్లు పేర్కొన్నారు. ఈ నెల్లో కాశ్మీర్ లో సంభవించిన భారీ వరదల్లో 280 వరకూ మృత్యువాత పడిన సంగతి తెలిసిందే.