టర్కీ బొగ్గు గనిలో భారీ విస్పోటం సంభవించింది. ఆ ప్రమాదంలో దాదాపు 200 మంది మరణించారు. బొగ్గు గని శిధిలాల కింద 400 మందికిపైగా కార్మికులు చిక్కుకుని ఉంటారని ఆ దేశ ఉన్నతాధికారులు బుధవారం వెల్లడించారు. ప్రమాదం జరిగినప్పుడు గనిలో 787 మంది ఉన్నారని చెప్పారు. టర్కీ రాజధాని ఇస్తాంబుల్కు 250 కిలోమీటర్ల దూరంలోని మనిసా ప్రావెన్స్ సోమా జిల్లాలోని ఆ ప్రమాదం చోటు చేసుకుందని తెలిపారు. ప్రమాద ఘటనలో 80 మంది గాయపడ్డారని, వారిలో నలుగురు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని టర్కీ ఇంధన శాఖ మంత్రి చెప్పారు. సహాయక చర్యలు తీవ్ర తరం చేసినట్లు తెలిపారు.
విద్యుత్ సరఫరాలో జరిగిన లోపాల కారణంగా ఆ పేలుడు సంభవించిందని తెలిపారు. అదికాక గనిలోని ఎలివేటర్ పని చేయడం లేదని చెప్పారు. గనిలోని షిఫ్ట్ పూర్తవుతున్న తరుణంలో ఆ ప్రమాదం జరిగిందన్నారు. 2012లో టర్కీలోని బొగ్గు గనులలో దాదాపు 80 ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. అందులో 61 మంది మరణించగా, 91 మంది కార్మికులు గాయపడ్డారు.