25% క్షీణించిన టాప్-5 రంగాల ఎగుమతులు
న్యూఢిల్లీ: దేశ వాణిజ్య ఎగుమతుల్లో 65% వాటాను కలిగి ఉన్న ఐదు ప్రధాన రంగాలైన ఇంజినీరింగ్, పెట్రోలియం, జెమ్స్ అండ్ జ్యువెల్లరీ, టెక్స్‌టైల్స్, ఫార్మా ఎగుమతులు ఆగస్ట్ నెలలో 25 శాతం మేర క్షీణించి 13.33 బిలియన్ డాలర్లకు తగ్గాయి. దీనికి అంతర్జాతీయ డిమాండ్ తగ్గుదలే ప్రధాన కారణం. ఈ 5 రంగాల ఎగుమతులు గతేడాది ఆగస్ట్ నెలలో 17.79 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.
ఎగుమతుల తగ్గుదలకు ఎలా అడ్డుకట్ట వేయాలనే అంశమై వాణిజ్య మంత్రిత్వ శాఖ అక్టోబర్ 7న ఎగుమతిదారులతో సమావేశాన్ని నిర్వహించనుంది. కేంద్ర ప్రభుత్వం 2020 నాటికి వస్తు సేవల ఎగుమతులను 900 బిలియన్ డాలర్లకు చేర్చాలని, అంతర్జాతీయ ఎగుమతుల్లో భారత్ వాటాను 2 శాతం నుంచి 3.5 శాతానికి పెంచాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. గతేడాది భారత్ ఎగుమతులు 310 బిలియన్ డాలర్లు.