
257 పాయింట్లు ఎగసిన సెన్సెక్స్
దాదాపు నెల రోజుల తరువాత గురువారం దేశీయ ఫండ్స్ నికర పెట్టుబడిదారులుగా నిలవడంతో స్టాక్ మార్కెట్లలో సెంటిమెంట్ మెరుగుపడింది. దీనికితోడు కొద్ది రోజులుగా జోరు తగ్గించిన ఎఫ్‌ఐఐలు కూడా కొనుగోళ్లవైపు మళ్లడం ఇందుకు దోహదం చేసింది. ఈ బాటలో శుక్రవారం ఎఫ్‌ఐఐలు ఇటీవలలేని విధంగా రూ. 745 కోట్లను ఇన్వెస్ట్ చేయడంతో ఇండెక్స్‌లకు జోష్ వచ్చింది. వెరసి సెన్సెక్స్ 257 పాయింట్లు పుంజుకుని 20,792 వద్ద నిలిచింది. ఇక నిఫ్టీ కూడా 84 పాయింట్లు ఎగసి 6,176 వద్ద స్థిరపడింది. దీంతో మూడు వారాల తరువాత మళ్లీ మార్కెట్లు వారం మొత్తానికి (3%) లాభాలతో నిలిచాయి. సెన్సెక్స్ 574 పాయింట్లు జమ చేసుకుంది. కాగా, శుక్రవారం సాయంత్రం విడుదలకానున్న జూలై-సెప్టెంబర్(క్యూ2) జీడీపీ గణాంకాలపై ఇన్వెస్టర్లలో అంచనాలు పెరిగాయని విశ్లేషకులు పేర్కొన్నారు. పలువురు ఆర్థికవేత్తలు జీడీపీ 4.5%పైగా వృద్ధి సాధించే అవకాశమున్నట్లు భావిస్తున్నారు.
బ్యాంకింగ్ జోరు
బీఎస్‌ఈలో అన్ని రంగాలూ లాభపడగా, బ్యాంకెక్స్ 2.2% పుంజుకుంది. ఈ బాటలో క్యాపిటల్ గూడ్స్, మెటల్స్, రియల్టీ 1.5%పైగా లాభపడ్డాయి. ఇక సెన్సెక్స్‌లో సెసా స్టెరిలైట్ 4.5% దూసుకెళ్లగా, భెల్, ఎస్‌బీఐ, సిప్లా, ఐసీఐసీఐ బ్యాంక్, ఓఎన్‌జీసీ, ఐటీసీ, ఎల్‌అండ్‌టీ 3.5-2% మధ్య పురోగమించాయి. అయితే మరోవైపు సెన్సెక్స్‌లో నాలుగు షేర్లు నామమాత్రంగా నష్టపోయాయి. ప్రధానంగా ఎంఅండ్‌ఎం 1.3% క్షీణించింది.
జూబిలెంట్ 10%అప్
మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు దాదాపు 1% బలపడగా, స్కిజోఫ్రెనియా తదితర మానసిక వ్యాధుల చికిత్సకు వినియోగించే సెరోక్వెల్ జనరిక్ వెర్షన్‌కు అమెరికా ఎఫ్‌డీఏ అనుమతి లభించడంతో జూబిలెంట్ లైఫ్ షేరు దాదాపు 10% జంప్ చేసింది. ఈ బాటలో ఎస్‌ఆర్‌ఎఫ్, జేబీఎఫ్, ఎడ్యుకాంప్, ఆన్‌మొబైల్, జేపీ, సద్భావ్, స్పైస్‌జెట్, ఎన్‌ఎండీసీ, ధనలక్ష్మీ బ్యాంక్, మణప్పురం ఫైనాన్స్, సిండికేట్ బ్యాంక్, పీఎఫ్‌సీ, వీఐపీ 20-5% మధ్య లాభపడ్డాయి. అయితే క్యూ2లో భారీ నష్టాల కారణంగా శ్రీ గణేశ్ జ్యువెలరీ 10% పతనమైంది. ట్రేడైన షేర్లలో 1,461 పుంజుకోగా, 1,032 డీలాపడ్డాయి.