సిద్ధూ ఆస్తులు హైజంప్!
28 శాతం పెరిగిన పంజాబ్ ఎమ్మెల్యేల ఆస్తులు: పీఈడబ్ల్యూ
చండీగఢ్: పంజాబ్‌లో ప్రస్తుత ఎన్నికల్లో పోటీలో నిలిచిన 94 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల ఆస్తులు సగటున 28 శాతం పెరిగాయని పీఈడబ్ల్యూ (పంజాబ్ ఎలక్షన్‌వాచ్) అనే స్వచ్ఛంద సంస్థ తెలిపింది. అభ్యర్థులు ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లలోని సమాచారాన్ని విశ్లేషించి సంస్థ ఈ వివరాలు వెల్లడించింది. 2012–17 మధ్య కాలంలో 94 మంది ఎమ్మెల్యేల సగటు ఆస్తి రూ.13.79 కోట్లని పేర్కొంది.
ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న మాజీ క్రికెటర్, ఎంపీ నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఆస్తులు భారీగా పెరిగాయనీ, 2009 లోక్‌సభ ఎన్నికలప్పుడు ఆయన ఆస్తులు రూ.14.5 కోట్లు కాగా ప్రస్తుతం రూ.45.9 కోట్లని పీఈడబ్ల్యూ వెల్లడించింది. అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ భగవంత్ మన్ ఆస్తులు తగ్గాయనీ, 2014 లోక్‌సభ ఎన్నికలప్పుడు ఆయన ఆస్తుల విలువ రూ.4.3 కోట్లు కాగా ప్రస్తుతం రూ.1.99 కోట్లని పీఈడబ్ల్యూ తెలిపింది. పార్టీల వారీగా చూస్తే అత్యధికంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఆస్తులు సగటున 35.64 శాతం పెరిగాయని సంస్థ పేర్కొంది.