
మృత్యు రంధ్రం.. ముగ్గురి బలి
హర్దోయి: సమస్యను చిటికెలో పరిష్కరిస్తానని వెళ్లిన వ్యక్తి ఎంతకీ తిరిగిరాలేదు. అతన్ని వెతుక్కుంటూ తండ్రి వెళ్లాడు. ఆయనా తిరిగిరాలేదు. ఆ తర్వాత మరో వ్యక్తి.. ఇలా బోరు బావిలో మోటార్ను రిపేర్ చేసేందుకు వెళ్లిన ముగ్గురు వ్యక్తులూ మృత్యువాతపడ్డారు. విషాదంరేపిన ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని హర్దోయి జిల్లా సంధిలాలో జరిగింది.
చెడిపోయిన ఓ బోరును బాగుచేసేందుకు సోను (18) అనే యువకుడు సోమవారం ఉదయం 10 గంటలకు బావిలోకి దిగాడు. మద్యాహ్నం వరకు బయటికి రాకపోయేసరికి తండ్రి భగవాన్ దీన్ (45) కొడుకును వెతుక్కుంటూ బావిలోకి దిగాడు. అతను కూడా తిరిగిరాకపోవడంతో అసలేం జరిగిందో తెలుసుకునేందుకు వాళ్ల సహాయకుడైన హేమరాజ్ (25) బావిలోకి వెళ్లాడు. ఈ ముగ్గురూ బావిలో ఏర్పడిన ప్రమాదకరమైన వాయువులు పీల్చడంవల్ల మరణించి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ముగ్గురి మృతదేహాలను వెలికితీసేందుకు అధికార యంత్రాంగం ప్రయత్నిస్తున్నది.