
గుజరాత్ పటేళ్ల ఆందోళనలో హింస
ఓబీసీ రిజర్వేషన్ల కోసం పటేళ్లు చేపట్టిన బంద్ కార్యక్రమంలో హింస చెలరేగింది. అహ్మదాబాద్, పాలన్ పూర్ పట్టణాల్లో జరిగిన వేరువేరు సంఘటనల్లో ఐదుగురు హత్యకు గురయ్యారు.
- ఐదుగురి హత్య.. 100 మందికి పైగా గాయలు
- సైన్యం మోహరింపు.. అదనపు సీఆర్పీఎఫ్ బలగాలు కూడా
అహ్మదాబాద్: తమను ఓబీసీ జాబితాలో చేర్చాలంటూ గుజరాత్లో పటేల్ వర్గం చేపట్టిన ఆందోళన హింసాయుతంగా మారింది. పాలన్ పూర్ పట్టణంలో బుధవారం మద్యాహ్నం ఇద్దరు వ్యక్తులు హత్యకు గురికాగా, అహ్మదాబాద్ నగరంలో నిన్న రాత్రి ముగ్గురు వ్యక్తులను గుర్తుతెలియని దుండగులు చంపేశారు. పలుచోట్ల చెలరేగిన ఘర్ణణల్లో 100 మందికి పైగా గాయపడ్డారు. మరిన్ని ప్రాంతాలకు హింస వ్యాప్తిని నిరోధించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. ఆ క్రమంలోనే భారత సైన్యాన్ని రంగంలోకి దిగాయి.
ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న అహ్మదాబాద్లోని కొన్న ప్రాంతాల్లో సైన్యాన్ని మోహరించి ఫ్లాగ్ మార్చ్ లను నిర్వహిచనున్నట్లు తెలిసింది. వాస్తవానికి పటేళ్ల బంద్ పిలుపుతో బుధవారం గుజరాత్ వ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలు, వ్యాపార సంస్థలు తెరుచుకోలేదు. అయితే రిజర్వేషన్ ఆందోళనకు నేతృత్వం వహిస్తున్న హర్దిక్ పటేల్ను మంగళవారం పోలీసులు అరెస్టు చేసినప్పటి నుంచి ఆందోళన కారులు హింసాయుత కార్యక్రమాలకు దిగారు. రాత్రికిరాత్రే దాదాపు 100 బస్సులను తగలబెట్టారు. ఈరోజు కూడా పలు ప్రాంతాల్లో అగ్నికీలలు ఎగిసిపడ్డాయి.
ఆందోళనల నేపథ్యంలో అదే రాష్ట్రానికే చెందిన ప్రధాని నరేంద్ర మోదీ శాంతియుతంగా ఉండాలంటూ గుజరాత్ ప్రజలకు, ప్రధానంగా పటేల్ వర్గానికి పిలుపునిచ్చారు. రిజర్వేషన్ల అంశం కూర్చుని మాట్లాడుకోవాల్సిందేగానీ, ఆందోళనలతో సాధ్యకాదని పేర్కొన్నారు. కాగా, ప్రధాని సందేశం ఇచ్చిన కొద్ది గంటల్లోనే మూడో హత్య చోటుచేసుకోవడం గమనార్హం.
కాగా, గుజరాత్ లో ఇప్పటికే 50 శాతం రిజర్వేషన్ ప్రక్రియ అమలవుతున్నదని, రాజ్యాంగం నిర్ధేశించినదాని ప్రకారం 50 శాతానికి మించి రిజర్వేషన్లు కల్పించడం సాధ్యకాదని, పటేళ్లకు ఓబీసీ రిజర్వేషన్లు ఇవ్వలేమని ముఖ్యమంత్రి ఆనందిబెన్ పటేల్ తేల్చిచెప్పారు. రిజర్వేషన్లు కల్పించేదాకా ఆందోళనలు విరమించేదిలేదని పటేళ్లు హెచ్చరిస్తున్నారు.