గుజరాత్ అగ్నిగుండం | 6 killed in Gujarat violence, Army called in | Sakshi
Sakshi News home page

గుజరాత్ అగ్నిగుండం

Published Thu, Aug 27 2015 1:36 AM | Last Updated on Tue, Aug 21 2018 2:29 PM

గుజరాత్ అగ్నిగుండం - Sakshi

గుజరాత్ అగ్నిగుండం

గుజరాత్ అగ్నిగుండమైంది. ఇతర వెనుకబడిన తరగతుల్లో(ఓబీసీ) తమను చేర్చాలన్న డిమాండ్‌తో పటేల్ సామాజిక వర్గీయులు చేపట్టిన...

* పటేల్ వర్గీయుల ఆందోళనలు హింసాత్మకం
* ఏడుగురి మృతి; వారిలో ఆరుగురు పోలీసు కాల్పుల్లో!  
* ఓబీసీ డిమాండ్ ఉద్యమం తీవ్రం
* గుజరాత్ బంద్ సంపూర్ణం, హింసాత్మకం  
* రాష్ట్ర వ్యాప్తంగా హింస; పోలీసులపై దాడులు
* ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల ధ్వంసం  
* సంయమనం పాటించాలని ప్రధాని విజ్ఞప్తి    
అహ్మదాబాద్/న్యూఢిల్లీ: గుజరాత్ అగ్నిగుండమైంది. ఇతర వెనుకబడిన తరగతుల్లో(ఓబీసీ) తమను చేర్చాలన్న డిమాండ్‌తో పటేల్ సామాజిక వర్గీయులు చేపట్టిన ఆందోళన హింసాత్మకమై, రాష్ట్రం మొత్తం విస్తరించింది.

ఆందోళనకారులు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేశారు. వాహనాలకు నిప్పంటించారు. పోలీసులపై తిరగబడ్డారు. వారిపై రాళ్లు రువ్వారు. వారి వద్ద నుంచి ఆయుధాలను లాక్కొనేందుకు ప్రయత్నించారు. పలు ప్రాంతాల్లో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు కాల్పులు జరిపారు. ఆందోళనల్లో ఏడుగురు మృతి చెందగా, పలువురు పోలీసులు సహా అనేకమంది గాయపడ్డారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు ఆర్మీ, పారా మిలటరీ దళాలు రంగంలోకి దిగాయి. అహ్మదాబాద్, సూరత్ సహా రాష్ట్రంలోని పలు నగరాలు, పట్టణాల్లో బుధవారం కర్ఫ్యూ విధించారు.

సంయమనం పాటించాలని, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని, గాంధీ పుట్టిన గడ్డపై హింసకు దిగరాదని స్వయంగా ప్రధాని మోదీ తన సొంత రాష్ట్రం గుజరాత్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ గుజరాత్ సీఎం ఆనందీబెన్ పటేల్‌తో మాట్లాడారు. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు అవసరమైన సాయం కేంద్రం అందిస్తుందన్నారు. బెదిరింపులకు భయపడబోమని, ఉద్యమాన్నితీవ్రం చేస్తామని ఉద్యమానికి నేతృత్వం వహిస్తున్న హార్దిక్ పటేల్(22) ప్రకటించారు. పోలీసుల వల్లనే తమ ఉద్యమం హింసాత్మకమైందన్నారు. కేంద్రం, లేదా రాష్ట్రం నుంచి వస్తున్న ఆదేశాల మేరకు పోలీసులు తమ ఉద్యమాన్ని అణచేయాలని చూస్తున్నారన్నారు.
 
బంద్ హింసాత్మకం..  ‘పటీదార్ అనామత్ ఆందోళన్ సమితి’ కన్వీనర్ హార్దిక్  అరెస్ట్‌తో రాష్ట్రంలో మంగళవారం రాత్రి నుంచి ప్రారంభమైన హింసాత్మక ఘటనలు బుధవారమూ కొనసాగాయి. అనంతరం ఆయనను విడుదల చేసినప్పటికీ ఆందోళనలు తగ్గుముఖం పట్టలేదు. హార్దిక్ ఇచ్చిన బంద్ పిలుపు మేరకు బుధవారం రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో జన జీవనం స్తంభించింది. విద్యాసంస్థలు, దుకాణాలు మూసేశారు. రైళ్లు సహా రవాణా వ్యవస్థ నిలిచిపోయింది.

పలు చోట్ల బస్సులు, ఇతర వాహనాలకు నిప్పటించారు. అహ్మదాబాద్, సూరత్, మెహసన, రాజ్‌కోట్, జామ్‌నగర్, ఆనంద్ తదితర నగరాల్లో హింసా ఘటనలు చోటు చేసుకున్నాయి. దాంతో ఆ నగరాల్లోని పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో సైన్యాన్ని మోహరించారు. అహ్మదాబాద్‌లో ఆర్మీ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించింది. 53 వేల మందితో కూడిన పారామిలటరీ బలగాలను పలు సమస్యాత్మక నగరాలకు పంపించారు.
 
పోలీసు కాల్పుల్లో ఆరుగురు..
ఆందోళనల్లో అహ్మదాబాద్‌లో ముగ్గురు, పాలంపూర్ పట్టణానికి దగ్గర్లోని గధ్ గ్రామంలో ముగ్గురు, మెహసన పట్టణంలో ఒకరు.. మొత్తం ఏడుగురు చనిపోయారని పోలీసులు తెలిపారు. వారిలో ఆరుగురు పోలీసు కాల్పుల్లో, ఒకరు తలపై తీవ్ర గాయంతో మరణించారన్నారు. అహ్మదాబాద్‌లో మంగళవారం రాత్రి తండ్రీకొడుకులు గిరీశ్ పటేల్(47), సిద్ధార్థ్(20) ఒక పోలీసు నుంచి ఆయుధాన్ని లాక్కొనేందుకు ప్రయత్నించగా ఆ ఆయుధం పేలి ఆ ఇద్దరు చనిపోయారని పోలీసులు తెలిపారు.

గధ్‌లో పోలీస్ స్టేషన్‌ను తగలపెట్టేందుకు ప్రయత్నిస్తున్నవారిపై పోలీసులు జరిపిన కాల్పుల్లో మరో ముగ్గురు చనిపోయారు. ఘట్లోడియాలో తలపై తీవ్రగాయంతో ఒక వ్యక్తి చనిపోయాడు. తీవ్రంగా కొట్టడం వల్లనే ఆయన చనిపోయాడని భావిస్తున్నారు. సూరత్‌లోనూ పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. పలు ప్రాంతాల్లో బస్సులు, బైక్‌లు, ఇతర వాహనాలకు నిప్పంటించారు. సూరత్ మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన రెండు గోదాములను ఆందోళనకారులు తగలపెట్టారు.

నగరంలోని వస్త్ర, వజ్ర పరిశ్రమల్లో పనులు నిలిచిపోయాయి. ఆందోళనకారుల రాళ్ల దాడిలో పోలీస్ ఇన్‌స్పెక్టర్ మితేశ్ సాలుంకే తీవ్రంగా గాయపడ్డారు. సౌరాష్ట్ర ప్రాంతానికి చెందిన రాజ్‌కోట్, జామ్‌నగర్, భావ్‌నగర్, పోర్‌బందర్ జిల్లాల్లోనూ హింస చోటు చేసుకుంది. రాజ్‌కోట్‌లో బస్‌స్టేషన్‌పై ఆందోళనకారులు దాడి చేసి, పలు బస్సులను ధ్వంసం చేశారు. కేంద్రమంత్రి మోహన్ కుందారియా ఇంటిపై దాడికి దిగారు. ఆందోళనకారుల రాళ్ల దాడిలో రాజ్‌కోట్ ఎస్పీ
గగన్‌దీప్ గాయపడ్డారు.

హింస వద్దు.. మోదీ సొంతరాష్ట్రం గుజరాత్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితిపై ప్రధాని మోదీ స్పందించారు. సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని, ప్రజలు హింసామార్గాన్ని పట్టవద్దని కోరారు. గుజరాత్ మహాత్మాగాంధీ, సర్దార్ పటేల్ వంటి మహనీయులు జన్మించిన గడ్డ అని గుర్తు చేశారు. హింసతో ఏమీ సాధించలేమన్నారు. శాంతి మాత్రమే ప్రజల ఏకైక మంత్రం కావాలని పిలుపునిచ్చారు. కాగా, పటేల్ వర్గీయులు మంగళవారం నిర్వహించిన భారీ ర్యాలీ సందర్భంగా లాఠీ చార్జీ చేయాలని ప్రభుత్వం పోలీసులను ఆదేశించలేదని రాష్ట్ర సీఎం ఆనందీబెన్ స్పష్టం చేశారు. లాఠీచార్జి ఘటనపై దర్యాప్తునకు ఆదేశించామన్నారు. శాంతియుత రాష్ట్రంగా పేరుగాంచిన గుజరాత్‌లో హింసకు పాల్పడి రాష్ట్రం పేరును చెడగొట్టవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
 
కీలక మంత్రులతో మోదీ భేటీ.. దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై ప్రధాని మోదీ కీలక కేబినెట్ సహచరులతో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. అధికారికంగా ప్రకటించనప్పటికీ.. గుజరాత్‌లో నెలకొన్న పరిస్థితి, మాజీ సైనికుల ఓఆర్‌ఓపీ డిమాండ్, భూ సేకరణ ఆర్డినెన్స్ పునఃప్రకటన తదితర అంశాలపై వారు చర్చించినట్లు సమాచారం.
అహ్మదాబాద్‌లో అగ్నికి ఆహుతైన బస్సు

అహ్మదాబాద్ ఆస్పత్రిలో చికిత్సకోసం ఎదురుచూస్తున్న పోలీసు
అహ్మదాబాద్‌లో నిరసనకారులను చెదరగొడుతున్న దృశ్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement