భువిలో దివి! | 300 years old Mughal garden identified by archaeologists | Sakshi
Sakshi News home page

భువిలో దివి!

Published Sun, Mar 26 2017 3:05 AM | Last Updated on Tue, Sep 5 2017 7:04 AM

300 years old Mughal garden identified by archaeologists

                                                       (300 ఏళ్ల నాటి మొఘల్‌ గార్డెన్‌ నమూనా)

‘నయా ఖిల్లా’ భూగర్భంలో అద్భుత ఉద్యానవనం
- 300 ఏళ్ల నాటి ‘మొఘల్‌ గార్డెన్‌’ను గుర్తించిన పురావస్తు పరిశోధకులు
- భారీ ఫౌంటెయిన్లు, నీటి కొలనులు, గార్డెన్లు
- గ్రావిటీతోనే నీరు ఎగసిపడేలా ఏర్పాట్లు
- కుతుబ్‌షాహీల సమయంలో నిర్మాణం
- ఇరాన్‌ నిపుణుల ఆధ్వర్యంలో ఏర్పాటు
- తాజ్‌మహల్‌ మొఘల్‌ గార్డెన్‌కు ఇదే మాతృక!


సాక్షి, హైదరాబాద్‌:
మూడు శతాబ్దాల కిందటి విశాల ఉద్యానవనం.. కరెంటు అందుబాటులో లేని ఆ కాలంలోనే అంతెత్తున నీటిని విరజిమ్మే ఫౌంటెయిన్లు.. గురుత్వాకర్షణ శక్తితో నీటిని తీసుకెళ్లే భూగర్భ కాలువలు.. మిగులు నీటిని ఇతర అవసరాలకు వినియోగించే ఏర్పాట్లు.. ఇదంతా ఎక్కడో కాదు.. మన హైదరాబాద్‌లోనే.. గోల్కొండ కోటలోని నయా ఖిల్లా ప్రాంతంలోనే అలరారిన ఉద్యానవనం అద్భుతాలివి.

అద్భుతమైన ప్యాలెస్‌లు, ఉద్యానవనాలకు పెట్టింది పేరైన ఇరాన్‌లో రూపుదిద్దుకున్న పర్షియా గార్డెన్ల తరహాలోనే దీనినీ నిర్మించారు. తాజ్‌మహల్‌ వద్ద ఉన్న మొఘల్‌గార్డెన్‌కు మాతృక అనదగ్గ ఈ అద్భుత ఉద్యానవనం ఆనవాళ్లను పురావస్తు శాఖ తాజాగా వెలుగులోకి తెచ్చింది. మొఘలుల కాలం కంటే ముందే రూపుదిద్దుకున్న ఈ ఉద్యానవనం.. మొఘల్‌ చక్రవర్తి ఔరంగజేబు చేతిలో కుతుబ్‌షాహీల పాలన ముగియటంతోనే కాలగర్భంలో కలిసిపోయినట్లు అంచనా వేస్తున్నారు.

ఎక్కడుంది..?
గోల్కొండ కోటలో అంతర్భాగంగా ఉన్న నయా ఖిల్లా వద్ద ఈ ఉద్యానవనం ఉంది. కాకతీయుల కాలంలో అబ్బురపడే రీతిలో నిర్మితమైన గోల్కొండ.. కుతుబ్‌షాహీల వశం అయ్యాక దాన్ని పర్షియన్‌ నమూనాలోకి మార్చడం ప్రారంభించారు. అందులో భాగంగా పక్కన 32 ఎకరాల విశాలమైన ప్రాంతం (ప్రస్తుతం నయా ఖిల్లా ఉన్న ప్రాంతం)లో ఉద్యానవనాన్ని తీర్చిదిద్దారు. అప్పట్లో ఇరాన్‌ నుంచి నిపుణులను పిలిపించి ఉద్యావనాన్ని రూపొందించారు. దీనికి ప్రస్తుతం లంగర్‌హౌజ్‌లో ఉన్న శాతం చెరువు, గోల్కొండ చెరువు నుంచి నీటిని వినియోగించారు. కాకతీయులు అప్పటికే నిర్మించిన ఆ చెరువుల నుంచి నీటిని తరలించేందుకు భూగర్భంలో టెర్రకోట పైపులతో ప్రత్యేక కాలువలు నిర్మించారు. నీరు గ్రావిటీతోనే తొలుత గోల్కొండలోని కటోరాహౌజ్‌కు, అక్కడి నుంచి ఈ ఉద్యానవనానికి చేరేలా ఏర్పాట్లు చేశారు. ఉద్యానవనం చుట్టూ భారీ వృక్షాలను పెంచారు. మధ్యలో అందమైన పూల చెట్లు, నీటి కొలనులు ఏర్పాటు చేశారు. అప్పటికి కరెంటు వసతి లేకున్నా.. గ్రావిటీతోనే నీళ్లు పారి, ఎగజిమ్మేలా ఫౌంటెయిన్లను నిర్మించారు. అప్పట్లో ఈ ఉద్యానవనం దేశంలోనే ప్రముఖంగా వెలుగొందిందని భావిస్తున్నారు. దీనిని చూసే మొఘల్‌ చక్రవర్తి షాజహాన్‌ తాజ్‌మహల్‌ వద్ద మొఘల్‌గార్డెన్‌ను, ఔరంగజేబు ఔరంగాబాద్‌లో బీబీకా మక్బారా గార్డెన్‌ను నిర్మించి ఉంటారని భావిస్తున్నారు.

                                                     (తవ్వకాల్లో వెలుగుచూసిన నిర్మాణం)
కుతుబ్‌షాహీల అనంతరం కనుమరుగు
మొఘలులు గోల్కొండను వశం చేసుకున్న తర్వాత.. పట్టించుకునేవారు లేకపోవటంతో ఉద్యానవనం క్రమంగా కనుమరుగైంది. నిర్మాణాలు మట్టి కింద కూరుకుపోయాయి. అసఫ్‌జాహీల హయాంలో ఈ ప్రాంతంలో వ్యవసాయం చేయడంతో కొంత ప్రాంతం సాగుభూమిగా మారింది. పాత రికార్డుల్లో అది సర్కార్‌ జమీన్‌గా ఉండటంతో.. కేంద్ర ప్రభుత్వానికి చెందుతుందా, రాష్ట్ర ప్రభుత్వానికి చెందుతుందా అన్న స్పష్టత లేక ఎవరూ పట్టించుకోలేదు. చివరికి రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుని కొన్నేళ్ల క్రితం రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థకు అప్పగించింది. తర్వాత సాగు నిలిచిపోయినా.. పాడుబడ్డ స్థలంగానే ఉండిపోయింది.

ఆ ఆధారంతోనే..
హైదరాబాద్‌ సంస్థానంలో పురావస్తు విభాగాన్ని పర్యవేక్షించిన గులామ్‌ యాజ్దానీ ఈ ఉద్యానవనం గురించి పరిశోధించి ఆ ప్రాంతాన్ని గుర్తించారు. తాను రాసిన పుస్తకంలో ఈ వివరాలను పొందుపరిచారు. ప్రస్తుతం మనకున్న చారిత్రక ఆధారం అదే. అయితే దాదాపు రెండేళ్ల క్రితం ఆ ప్రాంతంలో తవ్వకాలు జరిపి, ఉద్యానవనం జాడ కనుగొనాలని కేంద్ర పురావస్తు శాఖ నిర్ణయించింది. ప్రాథమికంగా తవ్వి నిర్మాణాలున్నట్టు గుర్తించినా.. పనులు ముందుకు సాగలేదు. ఇటీవల పురావస్తు శాఖ సూపరింటెండెంట్‌ ఆర్కియాలజిస్టు తాహిర్, ఇంజినీర్‌ గోపాలరావులు తవ్వకాలు ప్రారంభించి ఉద్యానవనాన్ని వెలుగులోకి తెచ్చారు. మరో నెలపాటు తవ్వకాలు జరగనున్నాయి. ఈ ప్రాంతాన్ని తిరిగి పాత ఉద్యానవనంలా మార్చాలని అధికారులు కేంద్రానికి ప్రతిపాదించారు. అనుమతి వచ్చి, నిధులు విడుదలయితే ఆ పనులు కూడా చేపడతామని చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement