ఈ ఏడాది దేశంలోని మూడింట ఒక వంతు భూభాగంలో అధిక వర్షపాతం నమోదైంది.
న్యూఢిల్లీ: ఈ ఏడాది దేశంలోని మూడింట ఒక వంతు భూభాగంలో అధిక వర్షపాతం నమోదైంది. అధిక వర్షపాతం నమోదైన ప్రాంతాల్లో తెలంగాణ, రాయలసీమ కూడా ఉండడం విశేషం. నైరుతి రుతుపవనాల ప్రభావం వల్ల దేశంలోని 53 శాతం విస్తీర్ణంలో సాధారణ వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ ప్రకటించింది. అయితే, కొన్ని ప్రాంతాల్లో సాధారణం కన్నా 28 శాతం వరకూ తక్కువ వర్షపాతం నమోదైంది. జూన్ 1 నుంచి సెప్టెంబర్ 18 వరకూ వర్షాలు కురిపించిన నైరుతి రుతుపవనాలు తిరుగుమొహం పట్టాయి. ఉత్తర, పశ్చిమ ప్రాంతాల నుంచి రుతుపవనాల ఉపసంహరణ ఇప్పటికే పూర్తయింది. వాతావరణ శాఖ గణాంకాల ప్రకారం.. ఈ ఏడాది దేశంలో సాధారణం కన్నా 4 శాతం అధికంగా వర్షం కురిసింది. 829 మి.మీ. సాధారణ వర్షపాతం కాగా ఈ ఏడాది 864 మి.మీ. వర్షపాతం నమోదైంది.