‘నాలుగేళ్ల గ్యారంటీ’ తేలేనా?
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ యాజమాన్య కోటా సీట్లకు మొదటి ఏడాది ఫీజు చెల్లింపుతోపాటు మిగతా నాలుగేళ్లకూ బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాలన్న యాజమాన్యాల వైఖరిపై విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన తీవ్రమైంది. ఒక ఏడాదికే గ్యారంటీ తీసుకోవాలని వైద్యారోగ్యశాఖ కోరుతుండగా... వైద్య కాలేజీల యాజమాన్యాలు ససేమిరా అంటున్నాయి. మరోవైపు శుక్రవారం నుంచే ఈ సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ జరగనుంది. కానీ ఇప్పటివరకు బ్యాంక్ గ్యారంటీపై ఎటువంటి స్పష్టత రాకపోవడంతో విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు.
ఎవరికి వారే..
రాష్ట్రంలో ప్రైవేటు వైద్య కళాశాలల్లోని బీ కేటగిరీలో 505 ఎంబీబీఎస్ సీట్లు, 350 డెంటల్ సీట్లున్నాయి. వాటికి ప్రైవేటు మెడికల్, డెంటల్ కాలేజీ యాజమాన్యాల సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక ఎం-సెట్ నిర్వహించారు. ఎంబీబీఎస్‌కు ఏడాదికి రూ.9 లక్షల చొప్పున.. ఐదేళ్లకు రూ.45 లక్షలు ఫీజుగా చెల్లించాలి. అయితే కౌన్సెలింగ్‌లో సీటు పొందే విద్యార్థులు మొదటి ఏడాదికి సంబంధించి రూ.9 లక్షలు చెల్లించడంతోపాటు మిగతా నాలుగేళ్లకు సంబంధించి కూడా రూ. 36 లక్షలకు బ్యాంకు గ్యారంటీ చూపించాలని ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు నిబంధన పెట్టాయి.
నాలుగేళ్ల బీడీఎస్ కోర్సుకు మొదటి ఏడాది రూ.4 లక్షల ఫీజుతోపాటు.. మిగతా మూడేళ్లకు రూ.12 లక్షలకు బ్యాంకు గ్యారంటీ కోరుతున్నాయి. ఇలా బ్యాంకు గ్యారంటీలు కోరడం ఇంతవరకెప్పుడూ లేదు. విద్యార్థులు మధ్యలో వెళ్లిపోయినా, ఫెయిలైనా తమకు నష్టమని... అందుకే బ్యాంకు గ్యారంటీ కోరుతున్నామని యాజమాన్యాలు చెబుతున్నాయి. విద్యార్థులు ఇవ్వలేకపోతే ప్రభుత్వమైనా కౌంటర్ గ్యారంటీ ఇవ్వాలని కోరుతున్నాయి.
మొత్తం ఫీజును అడ్వాన్సుగానైనా చెల్లించాలని, లేదా బ్యాంకు గ్యారంటీ అయినా తీసుకోవాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఉందని... ఆ ప్రకారమే తాము వ్యవహరిస్తున్నామని తెలంగాణ ప్రైవేటు మెడికల్, డెంటల్ కాలేజీల సంఘం అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారావు పేర్కొన్నారు. మరోవైపు ప్రభుత్వ వర్గాలు మాత్రం ఏడాది వరకు బ్యాంకు గ్యారంటీకి అంగీకరించేలా ప్రైవేటు యాజమాన్యాలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు చెబుతున్నాయి. కాగా.. బీ కేటగిరీ సీట్ల ఫీజు పెంపు, నాలుగేళ్ల బ్యాంకు గ్యారంటీ వ్యవహారంపై శుక్ర, శనివారాల్లో జరిగే కౌన్సెలింగ్ సందర్భంగా నిరసన వ్యక్తం చేసేందుకు కొన్ని విద్యార్థి సంఘాలు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
కౌన్సెలింగ్ వివరాలు
కౌన్సెలింగ్: ఈ నెల 21, 22 తేదీల్లో
స్థలం: పీజీఆర్‌ఆర్ దూర విద్యా కేంద్రం, ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్
21వ తేదీ: ఉదయం 9 నుంచి ఒంటి గంట వరకు - 1 నుంచి 500 ర్యాంకుల వరకు
ఒంటి గంట నుంచి చివరి వరకు- 501 నుంచి 1000 ర్యాంకుల వరకు
22వ తేదీ: ఉదయం 9 నుంచి ఒంటి గంట వరకు - 1001 నుంచి 1600 ర్యాంకులు
ఒంటి గంట నుంచి చివరి వరకు- 1601 నుంచి మిగిలిన ర్యాంకుల వరకు