ఆధునిక బానిసత్వంలో నాలుగు కోట్ల మంది!
న్యూయార్క్ : ప్రపంచవ్యాప్తంగా నాలుగు కోట్ల మంది ప్రజలు ఆధునిక బానిసత్వంలో మగ్గిపోతున్నారని ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో పనిచేస్తున్న అంతర్జాతీయ కార్మిక సంస్థ, అంతర్జాతీయ ఎన్జీవో సంస్థ ‘వాక్ ఫ్రీ ఫౌండేషన్’ సంయుక్తంగా నిర్వహించిన ఓ సర్వేలో తేలింది. ప్రతి నలుగురు బానిసల్లో ఒకరు పిల్లలు కావడం మరింత బాధాకరం. బెదిరింపులు లేదా నిర్బంధం వల్ల రెండున్నర కోట్ల మంది వెట్టి చాకిరి చేస్తుండగా, లక్షన్నర మంది పెళ్లి ముసుగులో వెట్టి చాకిరి చేస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా నాలుగు కోట్ల మంది బానిసత్వం అనుభవిస్తుంటే తాము చట్టాల ద్వారాగానీ, సహాయ సహకారాలు అందించడం ద్వారాగానీ కొన్ని లక్షల మంది బానిసలను మాత్రమే విడిపించగలుగుతున్నామని ‘వాక్ ఫ్రీ ఫౌండేషన్’ గ్లోబల్ రీసెర్చ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫియోనా డేవిడ్ తెలిపారు. ఈ సర్వేలో అంతర్జాతీయ కార్మిక సంస్థతో కలసి వాక్ ఫ్రీ ఫౌండేషన్ పాల్గొనడం ఇదే మొదటిసారి. 2016 సంవత్సరంలో ఈ సర్వేను నిర్వహించగా, వాటి వివరాలను ‘ఆధునిక బానిసత్వంపై ప్రపంచవ్యాప్తంగా అంచనాలు–2017’ పేరిట వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా నానాటికి పెరిగిపోతున్న ఆధునిక బానిసత్వంపై ప్రతి ఏటా పలు సంస్థలు సర్వేలో జరుపుతున్నా వాటి లెక్కల మధ్య మాత్రం ఎంతో తేడాలు ఉంటున్నాయి. దీనికి కారణం బాహ్య ప్రపంచానికి తెలియకుండా బానిసత్వం కొనసాగడం ఒక్కటైతే, కొన్ని సంస్థలు బానిసత్వానికి నిర్వచనం ఇవ్వడంలో కూడా భిన్న ప్రమాణాల పాటించడం మరోటి.
ఆధునిక బానిసత్వంలో 71 శాతం మంది మహిళలు, బాలికలే ఉన్నారు. వారిలో 99 శాతం మంది వేశ్యవత్తిలో కొనసాగుతున్నారు. వారిలో 84 శాతం పెళ్లి పేరిట బానిసత్వంలో మగ్గుతున్నారు. బలవంతంగా పెళ్ళిళ్లు చేసుకున్నవారిలో 37 శాతం పిల్లలు ఉండగా, వారిలో 21 శాతం మంది వేశ్యవత్తిలో కొనసాగుతున్నారు. మానవులు అక్రమ రవాణా, బలవంతపు పెళ్లిళ్లు, నిర్బంధం వెట్టి, అప్పులిచ్చి వెట్టి చేయించుకోవడం ద్వారా ఆధునిక బానిసత్వం కొనసాగుతోందని ఫ్రీ వాక్ ఫౌండేషన్ నిర్వచనం చెబుతోంది. భయపెట్టడం, బెదిరించడం, నిర్బంధించడం ద్వారా ఆధునిక బానిసలను అదుపుచేస్తున్నారని ఫౌండేషన్ నిర్వాహకులు తెలియజేస్తున్నారు.
15.20 కోట్ల మంది బాల కార్మికులు
ప్రపంచవ్యాప్తంగా బాల కార్మికులపై ‘ఫ్రీ వాక్ ఫౌండేషన్’తో సంబంధం లేకుండా సర్వే జరిపిన అంతర్జాతీయ కార్మిక సంస్థ మరో నివేదికను విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 15.20 కోట్ల మంది బాల కార్మికులు ఉన్నారు. వారిలో దాదాపు ఏడున్నర కోట్ల మంది ప్రజలు ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేస్తున్నారు. ప్రాణాలకు భద్రతలేని చోట, ఆరోగ్యానికి హాని కలిగే ప్రాంతాల్లో వారు పనిచేస్తున్నారు. ఆఫ్రికా, పసిఫిక్, ఆసియా ప్రాంతాల్లోనే 90 శాతం బాల కార్మికులు పనిచేస్తుండగా, ఒక్క ఆఫ్రికా ప్రాంతంలోనే 20 శాతం మంది పనిచేస్తున్నారు.