Walk free Foundation
-
ఆధునిక బానిసత్వంలో నాలుగు కోట్ల మంది!
న్యూయార్క్ : ప్రపంచవ్యాప్తంగా నాలుగు కోట్ల మంది ప్రజలు ఆధునిక బానిసత్వంలో మగ్గిపోతున్నారని ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో పనిచేస్తున్న అంతర్జాతీయ కార్మిక సంస్థ, అంతర్జాతీయ ఎన్జీవో సంస్థ ‘వాక్ ఫ్రీ ఫౌండేషన్’ సంయుక్తంగా నిర్వహించిన ఓ సర్వేలో తేలింది. ప్రతి నలుగురు బానిసల్లో ఒకరు పిల్లలు కావడం మరింత బాధాకరం. బెదిరింపులు లేదా నిర్బంధం వల్ల రెండున్నర కోట్ల మంది వెట్టి చాకిరి చేస్తుండగా, లక్షన్నర మంది పెళ్లి ముసుగులో వెట్టి చాకిరి చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా నాలుగు కోట్ల మంది బానిసత్వం అనుభవిస్తుంటే తాము చట్టాల ద్వారాగానీ, సహాయ సహకారాలు అందించడం ద్వారాగానీ కొన్ని లక్షల మంది బానిసలను మాత్రమే విడిపించగలుగుతున్నామని ‘వాక్ ఫ్రీ ఫౌండేషన్’ గ్లోబల్ రీసెర్చ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫియోనా డేవిడ్ తెలిపారు. ఈ సర్వేలో అంతర్జాతీయ కార్మిక సంస్థతో కలసి వాక్ ఫ్రీ ఫౌండేషన్ పాల్గొనడం ఇదే మొదటిసారి. 2016 సంవత్సరంలో ఈ సర్వేను నిర్వహించగా, వాటి వివరాలను ‘ఆధునిక బానిసత్వంపై ప్రపంచవ్యాప్తంగా అంచనాలు–2017’ పేరిట వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా నానాటికి పెరిగిపోతున్న ఆధునిక బానిసత్వంపై ప్రతి ఏటా పలు సంస్థలు సర్వేలో జరుపుతున్నా వాటి లెక్కల మధ్య మాత్రం ఎంతో తేడాలు ఉంటున్నాయి. దీనికి కారణం బాహ్య ప్రపంచానికి తెలియకుండా బానిసత్వం కొనసాగడం ఒక్కటైతే, కొన్ని సంస్థలు బానిసత్వానికి నిర్వచనం ఇవ్వడంలో కూడా భిన్న ప్రమాణాల పాటించడం మరోటి. ఆధునిక బానిసత్వంలో 71 శాతం మంది మహిళలు, బాలికలే ఉన్నారు. వారిలో 99 శాతం మంది వేశ్యవత్తిలో కొనసాగుతున్నారు. వారిలో 84 శాతం పెళ్లి పేరిట బానిసత్వంలో మగ్గుతున్నారు. బలవంతంగా పెళ్ళిళ్లు చేసుకున్నవారిలో 37 శాతం పిల్లలు ఉండగా, వారిలో 21 శాతం మంది వేశ్యవత్తిలో కొనసాగుతున్నారు. మానవులు అక్రమ రవాణా, బలవంతపు పెళ్లిళ్లు, నిర్బంధం వెట్టి, అప్పులిచ్చి వెట్టి చేయించుకోవడం ద్వారా ఆధునిక బానిసత్వం కొనసాగుతోందని ఫ్రీ వాక్ ఫౌండేషన్ నిర్వచనం చెబుతోంది. భయపెట్టడం, బెదిరించడం, నిర్బంధించడం ద్వారా ఆధునిక బానిసలను అదుపుచేస్తున్నారని ఫౌండేషన్ నిర్వాహకులు తెలియజేస్తున్నారు. 15.20 కోట్ల మంది బాల కార్మికులు ప్రపంచవ్యాప్తంగా బాల కార్మికులపై ‘ఫ్రీ వాక్ ఫౌండేషన్’తో సంబంధం లేకుండా సర్వే జరిపిన అంతర్జాతీయ కార్మిక సంస్థ మరో నివేదికను విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 15.20 కోట్ల మంది బాల కార్మికులు ఉన్నారు. వారిలో దాదాపు ఏడున్నర కోట్ల మంది ప్రజలు ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేస్తున్నారు. ప్రాణాలకు భద్రతలేని చోట, ఆరోగ్యానికి హాని కలిగే ప్రాంతాల్లో వారు పనిచేస్తున్నారు. ఆఫ్రికా, పసిఫిక్, ఆసియా ప్రాంతాల్లోనే 90 శాతం బాల కార్మికులు పనిచేస్తుండగా, ఒక్క ఆఫ్రికా ప్రాంతంలోనే 20 శాతం మంది పనిచేస్తున్నారు. -
బానిస బతుకులు..
‘‘ఇంత దారుణమైన జీవితాన్ని కలలో కూడా ఊహించలేరు. ఎన్నో చిత్రహింసలు అనుభవించా. చిన్నచిన్న తప్పులకూ గొడ్డును బాదినట్టు బాదేవారు. నా కుటుంబం కూడా దినదిన గండంగా బతుకుతోంది. నాపైనా, నా కుటుంబ సభ్యులపైనా నిరంతరం హింసకు పాల్పడేవారు’’ - అంతర్జాతీయ బానిసత్వ నివేదిక–2016 కోసం నిర్వహించిన సర్వేలో ఓ బాధితుని ఆవేదన ఇదీ. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు గడిచినా.. ఇప్పటికీ లక్షలాది మంది భారతీయులు బానిసలుగానే బతుకుతున్నారట. 2016 నాటికి ‘ఆధునిక బానిసత్వం’లో మగ్గుతున్న భారతీయుల సంఖ్య 1.83 కోట్లకు పైగానేఅట. 2014 నుంచి ఈ సంఖ్య 41 లక్షలు పెరిగిందట. గత రెండేళ్లలో ప్రతి రోజూ 5,616 మంది భారతీయులు బానిసలుగా మారారట. అంతర్జాతీయ బానిసత్వ సూచిక–2016 ఈ విషయాన్ని వెల్లడించింది. వాక్ ఫ్రీ ఫౌండేషన్ అనే సంస్థ ఈ సర్వే నిర్వహించింది. దేశంలో సగటున ప్రతి వంద మందిలో 51 మంది వెట్టి కార్మికులుగా, బలవంతపు బిచ్చగాళ్లుగా, బలవంతపు పెళ్లిళ్లు, కమర్షియల్ సెక్స్ వర్కర్లుగా మారుతున్నారని వెల్లడైంది. 2014 నాటికి బానిసత్వ పరిస్థితుల్లో జీవిస్తున్న ప్రజల సంఖ్య విషయంలో మన దేశం ప్రపంచంలోనే నాలుగో స్థానంలో ఉంది. ఉత్తరకొరియా, ఉజ్బెకిస్థాన్, కాంబోడియా మనకంటే ముందున్నాయి. ఇక ఆధునిక బానిసత్వం విషయంలో మనదేశం ఐదో స్థానంలో ఉంది. ఆసియా పసిఫిక్ రీజియన్‌లోనే అతి ఎక్కువ మంది ప్రజలు ఈ మోడరన్ స్లేవరీలో మగ్గుతున్నారని గ్లోబల్ స్లేవరీ ఇండెక్స్ వెల్లడించింది. ఈ ప్రాంతంలోనే 46 శాతం మానవ అక్రమ రవాణా కేసులు నమోదు అవుతున్నాయని, ఇందులో 83 శాతం మంది మగవారు కాగా, 17 శాతం మంది ఆడవారని తెలిపింది. బలవంతపు లేదా బాల్య వివాహాలు భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, నేపాల్, ఇండోనేసియాలోనే అత్యధికమని వెల్లడించింది. -
భారత్‌లోనే బానిసలెక్కువ
మెల్బోర్న్: లక్షలాది మంది భారతీయులు ఇప్పటికీ బానిసత్వంలో మగ్గుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 3 కోట్ల మంది బానిసలు ఉంటే.. ఒక్క భారతదేశంలోనే వీరి సంఖ్య సుమారు కోటీ 40 లక్షలు ఉందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా బానిసత్వానికి సంబంధించి తొలిసారిగా గ్లోబల్ స్లేవరీ ఇండెక్స్ 2013ను గురువారం విడుదల చేశారు. ఆస్ట్రేలియాకు చెందిన వాక్ ఫ్రీ ఫౌండేషన్ ఆధునిక బానిసత్వంపై 162 దేశాల్లో సర్వే నిర్వహించి ఈ నివేదికను విడుదల చేసింది. రుణ బానిసత్వం, బలవంతంగా వ్యభిచారంలోకి దించడం, చిన్నారులను సైన్యంలో ఉపయోగించడం, బలవంతంగా పెళ్లిళ్లు చేయడం తదితర అంశాలను ఆధునిక బానిసత్వంగా ఈ సంస్థ లెక్కించింది. భారత్‌లో అత్యధికంగా కోటీ 39 లక్షల మంది, చైనాలో 29 లక్షల మంది, పాకిస్థాన్‌లో 21 లక్షల మంది, నైజీరియాలో 7 లక్షల మంది బానిసలు ఉన్నారని బానిసత్వ సూచిలో తేలింది. భారతదేశంలో ఆ దేశ పౌరులే వివక్ష ఎదుర్కొంటున్నారని, బానిసత్వం విషయంలో రాష్ట్రాలకు, రాష్ట్రాలకు మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉందని వెల్లడించింది. ఇక మౌరిటానియా, హైతీ, పాకిస్థాన్ తదితర దేశాలతో పాటు భారత్‌లోనూ వంశపారంపర్యంగా బానిసత్వం కొనసాగుతోందని తెలిపింది. 162 దేశాల్లో బానిసత్వంపై పదేళ్ల పాటు పరిశోధన జరిపి ఈ నివేదిక రూపొందించినట్టు వాక్ ఫ్రీ ఫౌండేషన్ తెలి పింది. కాగా, ఈ సంస్థ చెప్పిన లెక్కలో సుమారు 2 కోట్ల మందికిపైగా బలవంతంగా బానిసత్వంలోకి దించబడుతున్నారని ఐక్యరాజ్యసమితి స్పష్టం చేసింది.