బానిస బతుకులు..
‘‘ఇంత దారుణమైన జీవితాన్ని కలలో కూడా ఊహించలేరు. ఎన్నో చిత్రహింసలు అనుభవించా. చిన్నచిన్న తప్పులకూ గొడ్డును బాదినట్టు బాదేవారు. నా కుటుంబం కూడా దినదిన గండంగా బతుకుతోంది. నాపైనా, నా కుటుంబ సభ్యులపైనా నిరంతరం హింసకు పాల్పడేవారు’’ - అంతర్జాతీయ బానిసత్వ నివేదిక–2016 కోసం నిర్వహించిన సర్వేలో ఓ బాధితుని ఆవేదన ఇదీ.
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు గడిచినా.. ఇప్పటికీ లక్షలాది మంది భారతీయులు బానిసలుగానే బతుకుతున్నారట. 2016 నాటికి ‘ఆధునిక బానిసత్వం’లో మగ్గుతున్న భారతీయుల సంఖ్య 1.83 కోట్లకు పైగానేఅట. 2014 నుంచి ఈ సంఖ్య 41 లక్షలు పెరిగిందట. గత రెండేళ్లలో ప్రతి రోజూ 5,616 మంది భారతీయులు బానిసలుగా మారారట. అంతర్జాతీయ బానిసత్వ సూచిక–2016 ఈ విషయాన్ని వెల్లడించింది. వాక్ ఫ్రీ ఫౌండేషన్ అనే సంస్థ ఈ సర్వే నిర్వహించింది.
దేశంలో సగటున ప్రతి వంద మందిలో 51 మంది వెట్టి కార్మికులుగా, బలవంతపు బిచ్చగాళ్లుగా, బలవంతపు పెళ్లిళ్లు, కమర్షియల్ సెక్స్ వర్కర్లుగా మారుతున్నారని వెల్లడైంది. 2014 నాటికి బానిసత్వ పరిస్థితుల్లో జీవిస్తున్న ప్రజల సంఖ్య విషయంలో మన దేశం ప్రపంచంలోనే నాలుగో స్థానంలో ఉంది. ఉత్తరకొరియా, ఉజ్‌బెకిస్థాన్, కాంబోడియా మనకంటే ముందున్నాయి.
ఇక ఆధునిక బానిసత్వం విషయంలో మనదేశం ఐదో స్థానంలో ఉంది. ఆసియా పసిఫిక్ రీజియన్‌లోనే అతి ఎక్కువ మంది ప్రజలు ఈ మోడరన్ స్లేవరీలో మగ్గుతున్నారని గ్లోబల్ స్లేవరీ ఇండెక్స్ వెల్లడించింది. ఈ ప్రాంతంలోనే 46 శాతం మానవ అక్రమ రవాణా కేసులు నమోదు అవుతున్నాయని, ఇందులో 83 శాతం మంది మగవారు కాగా, 17 శాతం మంది ఆడవారని తెలిపింది. బలవంతపు లేదా బాల్య వివాహాలు భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, నేపాల్, ఇండోనేసియాలోనే అత్యధికమని వెల్లడించింది.