భారత్‌లోనే బానిసలెక్కువ
మెల్‌బోర్న్: లక్షలాది మంది భారతీయులు ఇప్పటికీ బానిసత్వంలో మగ్గుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 3 కోట్ల మంది బానిసలు ఉంటే.. ఒక్క భారతదేశంలోనే వీరి సంఖ్య సుమారు కోటీ 40 లక్షలు ఉందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా బానిసత్వానికి సంబంధించి తొలిసారిగా గ్లోబల్ స్లేవరీ ఇండెక్స్ 2013ను గురువారం విడుదల చేశారు. ఆస్ట్రేలియాకు చెందిన వాక్ ఫ్రీ ఫౌండేషన్ ఆధునిక బానిసత్వంపై 162 దేశాల్లో సర్వే నిర్వహించి ఈ నివేదికను విడుదల చేసింది.
రుణ బానిసత్వం, బలవంతంగా వ్యభిచారంలోకి దించడం, చిన్నారులను సైన్యంలో ఉపయోగించడం, బలవంతంగా పెళ్లిళ్లు చేయడం తదితర అంశాలను ఆధునిక బానిసత్వంగా ఈ సంస్థ లెక్కించింది. భారత్‌లో అత్యధికంగా కోటీ 39 లక్షల మంది, చైనాలో 29 లక్షల మంది, పాకిస్థాన్‌లో 21 లక్షల మంది, నైజీరియాలో 7 లక్షల మంది బానిసలు ఉన్నారని బానిసత్వ సూచిలో తేలింది. భారతదేశంలో ఆ దేశ పౌరులే వివక్ష ఎదుర్కొంటున్నారని, బానిసత్వం విషయంలో రాష్ట్రాలకు, రాష్ట్రాలకు మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉందని వెల్లడించింది.
ఇక మౌరిటానియా, హైతీ, పాకిస్థాన్ తదితర దేశాలతో పాటు భారత్‌లోనూ వంశపారంపర్యంగా బానిసత్వం కొనసాగుతోందని తెలిపింది. 162 దేశాల్లో బానిసత్వంపై పదేళ్ల పాటు పరిశోధన జరిపి ఈ నివేదిక రూపొందించినట్టు వాక్ ఫ్రీ ఫౌండేషన్ తెలి పింది. కాగా, ఈ సంస్థ చెప్పిన లెక్కలో సుమారు 2 కోట్ల మందికిపైగా బలవంతంగా బానిసత్వంలోకి దించబడుతున్నారని ఐక్యరాజ్యసమితి స్పష్టం చేసింది.