భారత్‌లోకి 41 ఎంపి నోకియా లూమియా 1020
న్యూఢిల్లీ: ఫొటోగ్రఫీ ప్రియుల కోసం నోకియా కంపెనీ 41 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్, లూమియా 1020ను త్వరలో మార్కెట్లోకి తేనున్నది. వచ్చే నెల 11 నుంచి వీటి విక్రయాలు ప్రారంభిస్తామని, ధరను వచ్చే నెల 10న ప్రకటిస్తామని నోకియా కంపెనీ పేర్కొంది. అయితే ఈ ఫోన్ ధర రూ.47,000-48,000 ఉండొచ్చని పరిశ్రమ వర్గాల అంచనా. విదేశాల్లో ఈ ఫోన్‌ను నోకియా కంపెనీ 800 డాలర్లకు విక్రయిస్తోంది. తమ లూమియా ఫోన్లకు మంచి స్పందన లభిస్తోందని, ఈ లూమియా 1020కు కూడా అదే స్థాయి ఆదరణ లభించగలదని నోకియా ఇండియా ఎండీ పి.బాలాజీ చెప్పారు. డ్యుయల్ కాప్చర్ ఫీచర్ ఉన్న ఈ ఫోన్‌లో ఉన్న నోకియా ప్రో కెమెరా యాప్‌తో ఎవరైనా ప్రొఫెషనల్ క్వాలిటీ ఫొటోలు తీయవచ్చని పేర్కొన్నారు. విండోస్ 8 ఓఎస్‌పై పనిచేసే లూమియా 1020లో 2 జీబీ ర్యామ్, 32 జీబీ మెమరీ, 11.43 సెం.మీ. డిస్‌ప్లే, క్వాల్‌కామ్ స్పాప్‌డ్రాగన్ ఎస్4 ప్రాసెసర్, సూపర్ సెన్సిటివ్ టచ్‌స్క్రీన్ వంటి ప్రత్యేకతలున్నాయి. లూమియా రేంజ్‌లో లూమియా 520 చౌక ఫోన్ అని, ఆన్‌లైన్ అమ్మకాల్లో ఈ ఫోన్‌ల హవా అధికంగా ఉందని నోకియా ఇండియా డెరైక్టర్ విపుల్ మెహరోత్రా చెప్పారు. ఈ కంపెనీ లూమియా రేంజ్‌లో మొత్తం 13 మొబైల్ ఫోన్లను విక్రయిస్తోంది.
మరికాస్త పుంజుకున్న రూపీ
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ గురువారం ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ మార్కెట్‌లో వరుసగా రెండవ రోజూ బలపడింది. బుధవారం ముగింపుతో పోల్చితే 37 పైసలు లాభపడి 62.07 వద్ద ముగిసింది. ఇది వారం గరిష్టస్థాయి. ఎగుమతిదారుల అమెరికా కరెన్సీ అమ్మకాలు, ఈక్విటీ మార్కెట్ల లాభాలు రూపాయి ట్రేడింగ్‌పై సానుకూల ప్రభావం చూపాయి. పండుగల సీజన్ నేపథ్యంలో వ్యవస్థలో నగదు లభ్యత (లిక్విడిటీ) ఇబ్బందులు లేకుండా రిజర్వ్ బ్యాంక్ తగిన చర్యలు తీసుకుంటుందన్న వార్తలు సైతం రూపాయి బలోపేతానికి కారణమని ట్రేడర్లు పేర్కొన్నారు.