‘కబాలి’ సినిమా సంబురాలు అప్పుడే మిన్నంటుతున్నాయి. చెన్నైలోని చాలా థియేటర్ల వద్ద రజనీకాంత్ అభిమానుల సందడితో పండుగ వాతావరణం నెలకొంది. ఇటు దేశవ్యాప్తంగా ‘కబాలి’ సినిమా ఎలా ఉండబోతున్నది? అసలు ‘కబాలి’ ఏం చేయబోతున్నాడు? అని ఆసక్తిగా ఎదురుచూస్తోంది. రేపు (శుక్రవారం) ‘కబాలి’ విడుదలవుతున్న తరుణంలో ఈ సినిమాను ఎందుకు చూడాలి? అంటే.. ఇదిగో ఈ ఐదు కారణాలు చెప్పవచ్చు అంటున్నారు సినీ పరిశీలకులు..
1. రజనీ ఒక ప్రభంజనం
రజనీకాంత్ అంటే అభిమానులకు దేవుడు.. రజనీ సినిమాల్లో చేసే కొన్ని అద్భుతాలను పక్కనబెడితే.. సినీ ప్రేమికులూ ఆయన చిత్రాలను ఇష్టపడతారు. రజనీలో మంచి నటుడున్నాడని విమర్శకులు ఒప్పుకుంటారు. కానీ మాస్ ఇమేజ్, మ్యానరిజం చట్రంలో పడిపోయాడని పేర్కొంటారు. మొత్తానికి 1975లో మొదలైన ‘తలైవా’ ఇమేజ్ ఇప్పుడు శిఖరస్థాయిని అందుకుంది. రజనీ గత రెండు సినిమాలు- కొచ్చాడైయన్, లింగా- బాక్సాఫీసు వద్ద చతికిలపడ్డాయి. ఈ నేపథ్యంలో తన సర్వశక్తులొడ్డి.. తనను తాను బాక్సాఫీసు బాషాగా పునర్ ఆవిష్కరించికోవడానికి రజనీ చేసిన ప్రయత్నమే ‘కబాలి’ అని అంటున్నారు.
మరీ ముఖ్యంగా ఈ సినిమాలో రజనీ తొలిసారి తన ఒరిజినల్ లుక్‌తో కనిపించనున్నారు. తొలిసారి 50, 60 ఏళ్ల వ్యక్తిగా ఎలాంటి మేకప్ ట్రిక్కులు పెద్దగా లేకుండా, వెంట్రుకలకు రంగు వేసుకోకుండా రజనీ లుక్ ఇప్పటికే అభిమానుల్ని మెస్మరైజ్ చేస్తోంది.
2. కపాలీశ్వర్ కథ!
కథ గురించి పెద్దగా తెలియదు. కపాలీశ్వరన్ అనే చెన్నై గ్యాంగ్‌స్టర్ గా రజనీ కనిపించనున్నారు. మలేషియాలో మొదలైన ఆయన జీవితం.. అక్కడ శతాబ్దాలుగా నివసిస్తున్న తమిళులకూ సమాన హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం స్థూలంగా ఈ సినిమా కథ అని వినిపిస్తోంది. చరిత్రలోకి తొంగిచూస్తే 11వ శతాబ్దం పల్లవులు, చోళుల కాలం నాటి నుంచి తమిళులు మలేషియాలో ఆవాసం ఏర్పరుచుకొని జీవిస్తున్నారు. బ్రిటీష్ హయాంలోనూ ఎంతోమంది అక్కడికి వలసవెళ్లారు. ఈ నేపథ్యంలో తమిళుల హక్కులు అనే ఎమోషనల్ అంశం చుట్టూ ‘కబాలి’ కథ తిరుగొచ్చని అంటున్నారు.
3. యువ దర్శకుడి మ్యాజిక్
దర్శకుడిగా పా రంజిత్ ఇప్పటివరకు తెరకెక్కించినవి రెండే చిత్రాలు. కానీ ఈ రెండు చిత్రాలతో తనదైన ముద్రను అతను వేసుకున్నాడు. మంచి కథలను ఎంచుకొని.. దానికి లోకల్ ట్విస్టు యాడ్ చేసి.. నిజంగానే జరిగిందా? అన్నంత అద్భుతంగా పా రంజిత్ తన చిత్రాల్లో మ్యాజిక్ చేశాడు. అతడు తెరకెక్కించిన మద్రాస్, అడ్డకత్తి చిత్రాలు విమర్శకుల ప్రశంసలందుకున్నాయి. ఈ నేపథ్యంలో రజనీలాంటి సూపర్ స్టార్‌ను రంజిత్ ఎలా చూపించాడు.. కథను ఎలా హ్యాండిల్ చేశాడు.. తెరపై చూపాడు అన్నది ఆసక్తికరంగా మారింది.
4. సినిమా నిండా కొత్త రక్తం!
‘కబాలి’ సినిమాకు దర్శకుడే కాదు.. చాలావరకు టెక్నిషియన్స్, తారాగణం కూడా కొత్తవారే. రజనీ సినిమాకు సాధారణంగా ఏఆర్ రహమాన్ సంగీతం అందిస్తారు. కానీ ఈ సినిమాకు 33 ఏళ్ల యువ సంగీత దర్శకుడు సంతోష్ నారాయణ్‌కు అవకాశమిచ్చారు. ‘నెరుప్పుడా’ పాటతో అతను తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. అలాగే బాలీవుడ్ భామ రాధికా ఆప్టేకు మంచి నటిగా పేరుంది. ఆమెను రజనీ పక్కన హీరోయిన్‌గా తీసుకోవడం కూడా కలిసి వచ్చింది. ఇద్దరి మధ్య వయస్సుపరంగా వ్యత్యాసమున్నా.. రజనీ మ్యాజిక్ అది కవర్ చేస్తుందని అంటున్నారు.
5. కొత్త తరహాలో టేకింగ్..
ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు ‘కబాలి’ సినిమా ఎలా ఉండబోతున్నదో కొంతవరకు హింట్ ఇచ్చాయి. అభిమానులు పడిచచ్చే ‘రజనిజం’ మ్యానరిజానికి ఈ సినిమాలో కథానుగుణంగా కనిపిస్తాయని తెలుస్తోంది. ముఖ్యంగా పాత సినిమాల్లో మాదిరిగా రజనీ తన క్రాప్‌ను స్టైలిష్‌గా సరిచేసుకోవడం.. ‘కబాలి, రా’ అంటూ తనదైన స్టైల్‌లో పేర్కొనడం ఈ సినిమా ఎలా ఉండబోతున్నదో చెప్పకనే చెబుతున్నది. రజనీ మ్యానరిజం, స్టైల్స్ లోపించకుండా దర్శకుడు కథను ఎలా ముందుకు నడిపించాడో తెలుసుకోవాలంటే.. రేపటివరకు ఆగాల్సిందే.
‘కబాలి’ని ఎందుకు చూడాలి??
Published Thu, Jul 21 2016 4:57 PM | Last Updated on Mon, Sep 4 2017 5:41 AM
Advertisement
Advertisement