ఆ పెళ్లి కోసం 50 చార్టెడ్ విమానాలు
- పదివేల మంది అతిథులు హాజరు
- అందులో అత్యధికమంది వీవీఐపీలే
- నాగ్‌పూర్‌లో అత్యంత అట్టహాసంగా గడ్కరీ కూతురు పెళ్లి
పదివేల మంది అతిథులు. అందులో ఎక్కుమంది వీవీఐపీలే. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, పారిశ్రామికవేత్తలు ముకేశ్ అంబానీ, రతన్ టాటా, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే వంటి ప్రముఖులు.. వారిని నాగ్‌పూర్‌కు తరలించేందుకు 50 ప్రత్యేక చార్టెడ్ విమానాలు. ఇంత అట్టహాసం ఎందుకు అనుకుంటున్నారా! కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కూతురి పెళ్లి కోసం. ఆదివారం సాయంత్రం నాగ్‌పూర్‌లో అత్యంత అట్టహాసంగా ఈ వివాహం జరగబోతున్నది. రాజకీయ, పారిశ్రామిక, సినీ ప్రముఖులు అనేకమంది ఈ పెళ్లికి హాజరు కాబోతున్నారు. బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ, ఎమ్మెన్సెస్ చీఫ్ రాజ్ ఠాక్రే, ఆరెస్సెస్ అధినేత మోహన్ భగవత్, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, బిహార్ సీఎం నితీశ్‌కుమార్, ఎన్సీపీ అధినేత శరద్‌పవార్, సినీ ప్రముఖులు అమితాబ్ బచ్చన్, హేమామాలిని, వ్యాపారవేత్త కుమార్ మంగళం బిర్లా తదితర ప్రముఖులు పెళ్లి వేడుకల్లో పాల్గొనబోతున్నారు.
మరో నమ్మశక్యంకాని విషయమేమిటంటే.. ఈ పెళ్లి నేపథ్యంలో ఈ నెల 3, 4 తేదీల్లో దేశంలో ఎక్కడి నుంచైనా నాగ్‌పూర్ వెళ్లేందుకు విమాన టికెట్లు అందుబాటులోకి లేవట. 2010 డిసెంబర్‌లో గడ్కరీ పెద్ద కొడుకు పెళ్లి సందర్భంలోనూ నాగ్‌పూర్‌లో ఇదేవిధంగా అట్టహాసంగా ఏర్పాట్లు జరిగాయి. అప్పుడు గడ్కరీ బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు. గడ్కరీకి ముగ్గురు పిల్లలు ఉండగా ఇద్దరు కొడుకులు నిఖిల్, సారంగ్ పెళ్లిళ్లు అయిపోయాయి. ఇప్పుడు ఏకైక కూతురు కేత్కి పెళ్లి నాగ్‌పూర్‌కు చెందిన సంధ్య, రవీంద్ర కస్కేదికర్ దంపతుల కొడుకు ఆదిత్యతో జరుగుతున్నది. వరుడు అమెరికాలోని ఫేస్‌బుక్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. మహారాష్ట్ర శాసనసభ సమావేశాలు ఈ నెల 5 నుంచి జరగనుండటంతో శాసనసభ్యులందరూ ఈ పెళ్లికి హాజరయ్యే అవకాశం కనిపిస్తున్నది.