64 మందిని బలిగొన్న వదంతి
భోపాల్: నదిపై ఉన్న వంతెన కూలిపోతుందన్న వదంతి 64 మందిని బలితీసుకుంది. మధ్యప్రదేశ్లోని దతియా జిల్లా రతన్గఢ్ దుర్గామాత దేవాలయం సమీపంలో ఆదివారం జరిగిన తొక్కిసలాటకు వంతెన కూలిపోతుందన్న వదంతి కారణమని చెబుతున్నారు. ఈ దుర్ఘటనలో 64 మంది ప్రాణాలు కోల్పోయారు. 100 మందిపైగా గాయపడ్డారు.
దసరా నవరాత్రుల్లో భాగంగా అమ్మవారిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. సింధ్ నదిపై ఉన్న ఇరుకైన బ్రిడ్జి దాటుతుండగా ఒక్కసారిగా తొక్కిసలాట ప్రారంభమైంది. వంతెన కూలిపోతుందన్న వదంది రేగంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు. ఎవరికివారు ప్రాణభయంతో పరుగులు తీయడంతో తొక్కిసలాట జరిగింది. పలువురు కాళ్ల కింద నలిగిపోయి మృతిచెందగా, కొందరు నదిలో పడి ప్రాణాలు కోల్పోయారు.
అయితే పోలీసు లాఠీచార్జి కారణంగానే ఈ దుర్ఘటన జరిగిందని వచ్చిన ఆరోపణలను దతియా ఎమ్మెల్యే నరోత్తమ్ మిశ్రా తోసిపుచ్చారు. సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు.