సంక్షేమానికి ఆధార్ తప్పనిసరి కాదు
మరోసారి సుప్రీం స్పష్టీకరణ
సంక్షేమేతర పథకాలకు ఆధార్‌ను అడ్డుకోం
న్యూఢిల్లీ: సంక్షేమ పథకాలకు ఆధార్ తప్పనిసరి కాదని, స్వచ్ఛందమేనని సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసింది. సంక్షేమ పథకాల లబ్ధిదారులకు ప్రభుత్వం, ప్రభుత్వ ఏజెన్సీలు ఆధార్ కార్డును తప్పనిసరి చేయలేవని చెప్పింది. బ్యాంకు ఖాతాలు తెరిచేందుకు, ఐటీ రిటర్న్ దాఖలు వంటి సంక్షేమేతర అంశాలకు ఆధార్‌ను అడ్డుకోమని సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ జేఎస్ ఖేహర్, న్యాయమూర్తులు జస్టిస్ డీవై చంద్ర చూడ్, జస్టిస్ ఎస్‌కే కౌల్‌ల ధర్మాసనం పేర్కొంది.
ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛకు ఆధార్ భంగం కలిగిస్తుందన్న ఫిర్యాదు నేపథ్యంలో.. ఆధార్ పథ కాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ల విచారణకు ఏడుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం అవసరమని కోర్టు అభిప్రాయపడింది. కేసు విచారణ సందర్భంగా సీనియర్ న్యాయవాది శ్యామ్ దివన్ వాదిస్తూ.. ఆధార్ తప్పనిసరి కాదు స్వచ్ఛందమేనంటూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల్ని కేంద్ర ప్రభుత్వం పాటించడం లేదన్నారు. ఆధార్ కార్డు పథకాన్ని సవాలు చేస్తూ గతంలో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆధార్ పథకాన్ని పర్యవేక్షిస్తున్న యూనిక్ ఐడింటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ) ఏదైనా చట్టం, లేదా నోటిఫికేషన్ ద్వారా ఏర్పడలేదని, బయోమెట్రిక్ వివరాల్ని ప్రైవేట్ సంస్థల ద్వారా పొందుతుందంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు.
2015లోనే తప్పనిసరి కాదన్న సుప్రీంకోర్టు
ఆగస్టు 11, 2015న... ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధికి ఆధార్ తప్పనిసరికాదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఆధార్ పథకం కోసం సేకరించిన సమాచారాన్ని అధికారులు బయటకు వెల్లడించ కూడదంది. అక్టోబర్ 15, 2015న కోర్టు అంతకముందు విధించిన ఆంక్షల్ని ఎత్తివేస్తూ.. పథకాలకు ఆధార్‌ను స్వచ్ఛందంగా వాడుకోవచ్చంది. గ్రామీణ ఉపాధి హామీ పథకం, పింఛన్ పథకాలు, పీఎఫ్, జన్ ధన్ యోజనలకు స్వచ్ఛందంగా ఇస్తే ఆధార్‌ను తీసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. సుప్రీంకోర్టు తుది తీర్పు వెల్లడించే వరకూ ప్రభుత్వ పథకాలకు ఆధార్ స్వచ్ఛందమే గానీ తప్పనిసరి కాదని పేర్కొంది.