
అబ్దుల్ కలాం పరిస్థితి విషమం.. ఆస్పత్రిలో చేరిక
మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దాంతో ఆయనను షిల్లాంగ్లోని ఓ ఆస్పత్రిలో చేర్చారు. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు మేఘాలయ రాజధాని నగరం షిల్లాంగ్ వచ్చిన కలాం (84).. అనుకోకుండా అనారోగ్యం పాలయ్యారు. దాంతో ఆయనను వెంటనే సమీపంలోని బెథనీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు ఖాసి హిల్స్ ఎస్పీ ఎం.ఖర్క్రంగ్ తెలిపారు. ఆర్మీవైద్యులు దగ్గరుండి ఆయనకు చికిత్సలు అందిస్తున్నట్లు తెలిసింది.
షిల్లాంగ్లోని ఐఐఎంలో జరిగిన ఓ సెమినార్లో ప్రసంగిస్తూ ఆయన కుప్పకూలారు. దాంతో ఆయనను ఆస్పత్రికి తరలించాల్సి వచ్చింది. 9 గంటలకు ముందు కూడా ఆయన సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉన్నారు. తాను షిల్లాంగ్ వెళ్తున్నానని, అక్కడి విద్యార్థులతో భేటీ కానున్నానని ట్వీట్ చేశారు. అయితే అంతలోనే ఆయన తీవ్ర అనారోగ్యం పాలు కావడం పట్ల ఐఐఎం విద్యార్థులతో పాటు అందరూ ఆందోళన చెందుతున్నారు. ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉందని జాతీయ మీడియా వర్గాలు చెబుతున్నాయి. ఆయనను ఆస్పత్రిలోని ఐసీయూలో చేర్చి వైద్యులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. మేఘాలయ గవర్నర్ వి.షణ్ముగనాథన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.బి.ఒ. వర్జిరి ఇద్దరూ బెథనీ ఆస్పత్రికి వెళ్లి కలాం పరిస్థితి గురించి తెలుసుకున్నారు.
దాదాపు మరణించిన స్థితిలో...
కలాంను తమ ఆస్పత్రికి దాదాపు మరణించిన స్థితిలో తీసుకొచ్చారని, ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉందని బెథనీ ఆస్పత్రి డైరెక్టర్ జాన్ సైలో రైన్లాంథియాంగ్ చెప్పారు. పేషెంటును రక్షించేందుకు తాము అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన తెలిపారు. కలాం ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉన్నారని, ఆయనకు అన్ని రకాల పరీక్షలు చేస్తున్నారని, బహుశా ఆయనకు 'కార్డియాక్ అరెస్ట్' అయి ఉండొచ్చని అన్నారు.
Going to Shillong.. to take course on Livable Planet earth at iim. With @srijanpalsingh and Sharma.
— APJ Abdul Kalam (@APJAbdulKalam) July 27, 2015