
ఆ నోట్ల కట్టలు ఎక్కడివి.. ఎవరివి?
ఓటుకు నోటు స్కాంలో మరిన్ని కేసులు నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. నోట్ల కట్టలు ఎక్కడివనే కోణంలో కూడా దర్యాప్తు సాగుతోంది. రేవంత్ రెడ్డి డీల్ కేసు విచారణను ఏసీబీ అధికారులు వేగవంతం చేశారు. చంద్రబాబు ఇంకా ఎవరెవరిని కొనుగోలు చేయాలనుకున్నారు.. ఆ ఎమ్మెల్యేలకు ఎంతెంత డబ్బు ఇవ్వడానికి ఎరచూపారని అధికారులు ఆరా తీస్తున్నారు. ''కాంగ్రెస్ పార్టీ నుంచి ముగ్గరు రెడీ'' అంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం వీడియోలో స్పష్టంగా వినిపించింది.
విచారణ సందర్భంగా ఆ ఎమ్మెల్యేలు ముందుకొచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. దాంతో రేవంత్ వ్యవహారంలో చంద్రబాబు మెడకు కూడా ఉచ్చు బిగుసుకునే అవకాశం లేకపోలేదని అంటున్నారు. స్టీఫెన్కు ఇవ్వడానికి తీసుకొచ్చిన నోట్ల కట్టలు ఎక్కడివనే అంశంపై ఆరా తీస్తున్నారు. నోట్ల కట్టలపై ఉన్న సీరియల్ నంబరు ఆధారంగా దర్యాప్తునకు రంగం సిద్ధమవుతోంది. రేవంత్ వ్యవహారంలో మనీలాండరింగ్, ఈడీ కేసులు నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది.