అనంతపురం, న్యూస్‌లైన్ : అనంతపురంలో సంచలనం రేపిన బీకామ్ విద్యార్థిని వాణిపై జరిగిన యాసిడ్ దాడి కేసు మిస్టరీగా మారింది. ప్రియుడిపై కసితో ఆమే యాసిడ్ పోసుకుందని జిల్లా ఎస్పీ మీడియాకు వెల్లడించగా, కేసును పోలీసులు తప్పుదారి పట్టిస్తున్నారని బాధితురాలు కలెక్టర్‌కు విన్నవించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ ఘటనపై న్యాయవిచారణ జరిపిస్తామని కలెక్టర్ లోకేష్‌కుమార్ బాధితురాలికి హామీ ఇచ్చారు. ‘ముదిగుబ్బ మండల కేంద్రానికి చెందిన వాణి అనం తపురంలోని ఓ కళాశాలలో డిగ్రీ ఫైనలియర్ చదువుతోంది. చిన్ననాటి మిత్రుడైన పయ్యావుల రాఘవతో ప్రేమలో పడింది. కొద్ది రోజుల తర్వాత విభేదాలు రావడంతో రాఘవ మరో యువతిని వివాహం చేసుకున్నాడు. దీంతో వాణి.. మహేష్ అనే మిత్రుని సాయంతో రాఘవపై పగ తీర్చుకునేందుకు కుట్ర పన్నింది. ఈనెల 2న కళాశాల నుంచి బస్సు దిగి కాలి నడకన ఇంటికి వెళుతూ తనవద్ద ఉన్న యాసిడ్‌ను ఒంటిపై పోసుకుని, గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి యాసిడ్ చల్లారని స్థానికులను నమ్మించింది.
వారు వెంటనే ఆమెను ఆస్పత్రికి చేర్చారు. ప్రియుడు పయ్యావుల రాఘవ, అతని సోదరుడు రామకృష్ణ తనపై యాసిడ్ దాడి చేశారంటూ వాణి ఫిర్యాదు చేసింది. కేసు విచారణలో భాగంగా బాధితురాలి సెల్‌ఫోన్ కాల్స్ జాబితాలో మహేష్ అనే యువకుడితో ఆమె ఎక్కువగా మాట్లాడినట్లు గుర్తించి అతడిని అదుపులోకి తీసుకుని విచారించాం. మొదట వాణి ఫిర్యాదు మేరకు రాఘవ, రామకృష్ణలపై కేసు నమోదు చేశాం. పోలీసులను తప్పుడు ఫిర్యాదుతో పక్కదారి పట్టించిన వాణిపై కూడా చట్టరీత్యా కేసు నమోదు చేస్తాం..’ అని ఎస్పీ చెప్పారు. యాసిడ్‌ను వాణికి ఇచ్చింది తానేనని ఆమె మిత్రుడు మహేష్ మీడియాకు చెప్పారు. ఆమె తనకు తాను యాసిడ్ దాడి చేసుకుంటానని చెప్పిందని, తాను భయపడి ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదని తెలిపారు. ‘పోలీ సులు ఈ కేసును తప్పుదారి పట్టిస్తున్నారు’ అంటూ వాణి మీడియా ఎదుట కంటనీరు పెట్టారు.
యాసిడ్ దాడి డ్రామా!
Published Fri, Sep 20 2013 12:48 AM | Last Updated on Fri, Aug 17 2018 2:10 PM
Advertisement