తమిళ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం
చెన్నై: తమిళ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు శరత్ కుమార్.. శశికళ వర్గానికి మద్దతు ప్రకటించారు. ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఆర్కే నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికలో అన్నాడీఎంకే శశికళ వర్గం తరపున పోటీ చేస్తున్న టీటీవీ దినకరన్ కు ఆయన అండగా నిలిచారు. గురువారం దినకరన్ ను కలిసి సంఘీభావం తెలిపారు. జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కేనగర్ నియోజకవర్గానికి ఈ నెల 12న ఉప ఎన్నిక జరగనుంది.
డీఎంకే అభ్యర్థిగా మరుదు గణేషన్, అన్నాడీఎంకే పురట్చితలైవి అమ్మ(పన్నీర్ సెల్వం వర్గం) అభ్యర్థిగా మధుసూదనన్, స్వతంత్ర అభ్యర్థిగా జయలలిత మేన కోడలు దీపా జయకుమార్, సీపీఎం అభ్యర్థిగా లోకనాథన్, బీజేపీ అభ్యర్థిగా గంగై అమరన్, డీఎండిడీకే అభ్యర్థిగా మదివానన్, నామ్ తమిళర్ కట్చి అభ్యర్థిగా కలైకోట్ ఉదయంలతో పాటుగా స్వతంత్ర అభ్యర్థులు ఆర్కేనగర్ లో పోటీ చేస్తున్నారు.
గతంలో అన్నాడీఎంకే మద్దతుదారుగా ఉన్న శరత్ కుమార్ తర్వాత ఆ పార్టీకి దూరమయ్యారు. డీఎంకే-తమిళ మాలిన కాంగ్రెస్ కూటమికి తర్వాత మద్దతు ప్రకటించారు. 2007లో ఆల్ ఇండియా సమతువ మక్కల్ కచ్చి పేరుతో సొంతంగా రాజకీయ పార్టీ స్థాపించారు. పెద్దగా రాణించకపోవడంతో క్రియాశీలక రాజకీయాలకు క్రమంగా దూరమయ్యారు. ఆర్కేనగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో మళ్లీ అన్నాడీఎంకేకు దగ్గరయేందుకు ప్రయత్నిస్తున్నారు.