సిట్ విచారణకు హీరోయిన్ చార్మీ
హైదరాబాద్ : డ్రగ్స్ మాఫియా కేసులో సిట్ అధికారుల విచారణ ఏడో రోజు కొనసాగుతోంది. ఈ కేసులో నోటీసులు అందుకున్న సినీనటి చార్మి విచారణ నిమిత్తం బుధవారం సిట్ అధికారుల ఎదుట హాజరయ్యారు. నలుగురు బౌన్సర్ల భద్రత మధ్య చార్మీ సిట్ కార్యాలయానికి చేరుకున్నారు.
ఈ రోజు ఉదయం ఆమె కొండాపూర్‌లోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో పైసా వసూలు సినిమా షూటింగ్‌లో పాల్గొని అక్కడ నుంచే నేరుగా నాంపల్లిలోని అబ్కారీ కార్యాలయానికి వచ్చారు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న పైసా వసూలు చిత్రానికి చార్మీ లైన్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆమె ఇటీవలే పూరీ జగన్నాథ్‌తో కలిసి ‘పూరీ కనెక్ట్’ పేరుతో ఓ చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించారు.
కాగా చార్మిని హైకోర్టు ఆదేశాలతో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం అయిదు గంటల వరకూ విచారణ చేయనున్నారు. ఒకవేళ హైకోర్టు ఇచ్చిన సమయంలో విచారణ పూర్తి కాకుంటే ఆమెను రేపు (గురువారం) కూడా ప్రశ్నించే అవకాశం ఉంది. డ్రగ్స్ ముఠాతో పాటు, సినీ ప్రముఖులతో సంబంధాలపై మహిళా అధికారుల బృందం ఆమెను విచారణ చేయనున్నారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే నోటీసులు అందుకున్న పలువురు సినీ ప్రముఖులు సిట్ ఎదుట హాజరైన విషయం తెలిసిందే. దర్శకుడు పూరీ జగన్నాథ్, శ్యామ్ కే నాయుడు, సుబ్బరాజు, తరుణ్, నవదీప్, ఆర్ట్ డైరెక్టర్ చిన్నాలను సిట్ అధికారులు విచారణ చేశారు.