
ఎన్నికలయ్యాక పెట్టుబడుల ప్రవాహం
ఇన్వెస్టర్లకు పార్టీలు ముఖ్యం కాదు.. స్థిరమైన పాలనే ప్రాధాన్యం
కొత్త ప్రభుత్వ ఏర్పాటు కోసం వారు ఎదురుచూస్తున్నారు
ఇండియా రేటింగ్స్ చీఫ్ అతుల్ జోషీ
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత నుంచి విదేశీ పెట్టుబడులు మళ్లీ ఊపందుకోవడం మొదలవుతుందని ఇండియా రేటింగ్స్ చీఫ్ అతుల్ జోషి చెప్పారు. అయితే, మొత్తం ఎకానమీని సంభ్రమంలో ముంచెత్తే మ్యాజిక్ ఏదీ సమీప భవిష్యత్‌లో జరిగే అవకాశాలు లేవని ఆయన పేర్కొన్నారు. చాలా మంది విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులపై నిర్ణయాలు తీసుకోవడానికి సంబంధించి కొత్త ప్రభుత్వం ఏర్పాటు కోసం వేచి చూస్తున్నారని అతుల్ జోషి తెలిపారు. ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్న దానికన్నా స్థిరమైన పాలనే ప్రాతిపదికగా వారు నిర్ణయాలు తీసుకోవచ్చని ఆయన వివరించారు. ‘వాళ్లు భారత్‌కి రావద్దనుకోవడం లేదు. తప్పకుండా వస్తారు. అయితే వారు ప్రభుత్వం ఏర్పాటు కోసం వేచి చూస్తున్నారు. ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్న దానిపై వారికి పెద్ద పట్టింపు లేదు’ అని జోషి వ్యాఖ్యానించారు. ప్రభుత్వం స్థిరంగా అయిదేళ్లూ కొనసాగుతుందన్న భరోసానే వారికి కావాల్సి ఉందన్నారు.
దేశీ కార్పొరేట్ల రుణభారం పెరిగిపోవడం, డిమాండ్ మందగించడం వంటి కారణాల వల్ల కొత్తగా భారీ ప్రాజెక్టులు రావడం లేదని జోషి చెప్పారు. దేశీ కార్పొరేట్లు తమ కంపెనీలను చక్కదిద్దుకోవాల్సిన అవసరం ఉందని జోషి చెప్పారు. కొత్త ప్రాజెక్టులు రాకపోవడానికి ప్రభుత్వాన్నే నిందించడం తగదని, ఇందులో కార్పొరేట్ల పాత్ర కూడా ఉందని ఆయన చెప్పారు. మరోవైపు, వచ్చే రెండేళ్లలో స్థూల దేశీయోత్పత్తి వృద్ధి ఎకాయెకిన 8 శాతానికి ఎగిసిపోయేలా మాయలేమీ జరగవన్నారు. దీనిపై ఎన్నికల ప్రభావమేమీ ఉండదని జోషి వివరించారు. రికవరీ ప్రక్రియ క్రమంగా జరుగుతోందని, ప్రభుత్వం కొన్ని సంస్కరణలను వెనక్కి తీసుకుంటే తప్ప ఇది ఆగే అవకాశం లేదని జోషి పేర్కొన్నారు. కానీ ఏ ప్రభుత్వం కూడా ఇలాంటి చర్యలు తీసుకోకపోవచ్చన్నారు.