ముగ్గురు పిల్లల్నీ చంపేసి.. దంపతుల ఆత్మహత్య! | after killing three children, couple committed suicide in karimnagar dist | Sakshi
Sakshi News home page

ముగ్గురు పిల్లల్నీ చంపేసి.. దంపతుల ఆత్మహత్య!

Published Tue, Jul 11 2017 4:23 AM | Last Updated on Wed, Jul 10 2019 7:55 PM

చిన్నారుల మృతదేహాలు(ఇన్‌సెట్‌లో మృతులు కొమురయ్య, కొమురమ్మ) - Sakshi

చిన్నారుల మృతదేహాలు(ఇన్‌సెట్‌లో మృతులు కొమురయ్య, కొమురమ్మ)

- మంత్రాలు చేస్తున్నారంటూ అవమానించడంతో దారుణం
- కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ మండలం కందుగుల గ్రామంలో విషాదం
- మంత్రాలు చేస్తోందంటూ సొంత చెల్లెలిపైనే అన్నావదినల దాడి.. కలత చెంది ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం
- పిల్లలకు ఉరివేసి చంపేసి.. ఆపై దంపతులూ బలవన్మరణం
- మృతదేహాలను పరిశీలించిన మంత్రి ఈటల.. ముగ్గురిపై కేసు నమోదు


సాక్షి, కరీంనగర్‌/హుజూరాబాద్‌

పిల్లలకు చిన్న దెబ్బ తగిలినా తల్లడిల్లిపోతాం.. వారి బాధ చూడలేక మనమూ కన్నీళ్లు పెట్టుకుంటాం.. కానీ ఓ తల్లిదండ్రులు తమ ముగ్గురు కన్నబిడ్డలనూ తమ చేతులతోనే చంపేశారు.. ఒకరి తర్వాత ఒకరికి ఉరివేశారు. వారి మృతదేహాలను మంచంపై వరుసగా పడుకోబెట్టి.. తల్లిదండ్రులు కూడా ఉరివేసుకున్నారు.. మంత్రాలు చేస్తున్నారంటూ దగ్గరివారే నిందలు వేసి అవమానించడాన్ని భరించలేక ఆ కుటుంబం దారుణానికి పాల్పడింది.

కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ మండలం కందుగులలో ఆదివారం వేకువజామున ఈ విషాదం చోటు చేసుకుంది. ముగ్గురూ పదేళ్లలోపు పిల్లలే కావడం, ఒకే కుటుంబంలో ఐదుగురు మరణించడంతో కందుగుల గ్రామం శోక సంద్రంగా మారింది. తాము చనిపోతే కూతుళ్లు ఎలా బతుకుతారోనన్న ఆవేదనో.. తమపై వచ్చిన మచ్చకు కూతుళ్లను ఎక్కడ వేధిస్తారనుకున్నారోగానీ.. కన్నబిడ్డలను తమ చేతులతోనే చంపేసిన ఘటన అందరి హృదయాలను కలచివేసింది.

కొంతకాలంగా అనుమానాలు
చిగురుమామిడి మండలం కొండాపూర్‌కు చెందిన చిన్నబత్తుల రాజయ్య, లచ్చమ్మలకు ముగ్గురు కుమార్తెలు, ముగ్గురు కుమారులు. అందరికీ పెళ్లిళ్లయ్యాయి. వీరిలో చిన్న కుమారుడు కొద్దిరోజుల కింద మరణించాడు. రెండో కుమార్తె కొమురమ్మకు కందుగుల గ్రామానికి చెందిన గంట కొమురయ్యతో పదేళ్ల కింద వివాహం చేశారు. వీరికి ముగ్గురు కుమార్తెలు ఎల్లమ్మ (9), కోమల (6), అంజలి (4) ఉన్నారు. ఈ కుటుంబం కులవృత్తి (గంగిరెద్దుల) అయిన యాచక వృత్తి చేసుకుంటూ జీవిస్తున్నారు. అయితే కొంతకాలంగా కొమురమ్మ తమపై మంత్రాలు చేస్తోందని, అందుకే తమ ఆరోగ్యం బాగుండడం లేదని ఆమె అన్న కొమురయ్య, అతడి భార్య పెద్ద రాజమ్మ, చనిపోయిన తమ్ముడి భార్య చిన్నరాజమ్మ అనుమానిస్తున్నారు. వారు దీనిపై తరచూ గొడవపడుతుండడంతో కొమురమ్మ కొంతకాలంగా పుట్టింటికి వెళ్లడమే మానేసింది. అయితే ఇటీవల కొమురమ్మ తల్లిదండ్రులు రాజయ్య, లచ్చమ్మ మానకొండూర్‌ మండల కేంద్రానికి నివాసాన్ని మార్చడంతో.. అప్పుడప్పుడూ వారి వద్దకు వెళ్లి వస్తోంది.

అప్పు చెల్లిస్తానని తీసుకెళ్లి..
రాజయ్య గతంలో కొమురమ్మ వద్ద రూ.5 వేలు అప్పుగా తీసుకున్నాడు. ఆ సొమ్ము తిరిగిస్తానంటూ కుమార్తెను, అల్లుడిని మానకొండూర్‌కు పిలిపించుకున్నాడు. అయితే పెద్ద రాజమ్మ అనారోగ్యంతో ఉందని, ఆమెను సిద్దిపేట జిల్లా ధూళికట్టలోని ఓ చర్చికి తీసుకెళ్లారని వారికి సమాచారం వచ్చింది. దీంతో రాజయ్య, కొమురమ్మ, కొమురయ్యలు ధూళికట్టకు వెళ్లారు. కానీ అక్కడ కొమురమ్మను అన్నావదినలతో సహా తండ్రి కూడా తీవ్రంగా దూషించినట్లు తెలిసింది. ‘నువ్వు మంత్రాలు చేయడం వల్లే మాకు ఇలా జరుగుతోంది.. రోగాల పాలవుతున్నం.. మళ్లీ ఏ ముఖం పెట్టుకుని వచ్చావ్‌..’అంటూ దాడికి కూడా పాల్పడినట్లు సమాచారం. దీంతో కొమురమ్మ దంపతులు బాధతో ఇంటి ముఖం పట్టారు. ఈ అవమానం తట్టుకోలేక చనిపోవాలని నిర్ణయించుకున్నారు. తాము చనిపోతే పిల్లల పరిస్థితి ఏమవుతుందోనన్న ఆవేదనతో వారిని చంపి.. ఆత్మహత్య చేసుకోవాలని భావించారు.

బోనాలు చేసుకుంటున్నామంటూ..
కొమురమ్మ దంపతుల ముగ్గురు కుమార్తెల్లో చిన్న కుమార్తె వారివద్దే ఉండగా.. హుజూరాబాద్‌లోని బాల సదనంలో ఎల్లమ్మ ఐదో తరగతి, కోమల రెండో తరగతి చదువుతున్నారు. ఆదివారం ఉదయం బాల సదనానికి వచ్చిన కొమురయ్య తమ ఇంట్లో బోనాలు చేసుకుంటున్నామని, తమ పిల్లలను పంపించాలని వార్డెన్‌కు లెటర్‌ రాసిచ్చి వెంట తీసుకెళ్లాడు. అదేరోజు రాత్రి ముగ్గురు కుమార్తెలకు ఉరివేసి.. అనంతరం దంపతులు కూడా ఉరి వేసుకున్నారు. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు చనిపోవడంతో కందుగుల గ్రామం శోక సంద్రంగా మారింది. నిన్నటి వరకు తమతో కలిసి చదువుకున్న, ఆటలాడుకున్న ఎల్లమ్మ, కోమల మృతి చెందారనే తెలియడంతో బాల సదనంలో విద్యార్థులు, సిబ్బంది కన్నీటి పర్యంతమయ్యారు.

ముగ్గురిపై కేసు నమోదు
కొమురమ్మ దంపతుల ఆత్మహత్య ఘటనకు సంబంధించి ముగ్గురు నిందితులను చిగురుమామిడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతుడు కొమురయ్య అన్న ఎల్లయ్య ఫిర్యాదు మేరకు కొమురమ్మ అన్న చిన్నబత్తుల కొమురయ్య, అతడి భార్య రాజమ్మ, మరో అన్న భార్య పెద్ద రాజమ్మలపై కేసు నమోదు చేసినట్లు టౌన్‌ సీఐ రమణమూర్తి తెలిపారు.

ఇలాంటి ఘటనలు బాధాకరం: ఈటల
కందుగుల ఘటన విషయం తెలుసుకున్న మంత్రి ఈటల రాజేందర్‌ హుజూరాబాద్‌లోని ప్రభుత్వాసుపత్రిలో కొమురమ్మ దంపతులు, పిల్లల మృతదేహాలను సందర్శించారు. ఈ ఘటన బాధాకరమని.. సంచార తెగల్లో నిరక్షరాస్యత, మూఢ నమ్మకాలు ఇంకా బలంగా ఉండడమే ఈ పరిస్థితికి కారణమని వ్యాఖ్యానించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

గతంలోనూ ‘మంత్రాల’గొడవలు!
కందుగుల గ్రామంలోని గంగిరెద్దులకాలనీలో రెండేళ్ల కింద కూడా మంత్రాల నెపంతో కుటుంబాల మధ్య ఘర్షణలు జరిగాయి. తాజా ఘటనలో ఆత్మహత్య చేసుకున్న కొమురయ్య బంధువైన ఓ మహిళ మంత్రాలు చేస్తోందంటూ కొండయ్య అనే ఓ వ్యక్తి గొడవకు దిగాడు. అయితే ఆ కులానికి చెందిన పెద్ద మనుషులు ఇరు వర్గాల నుంచి రూ.5 లక్షల చొప్పున డిపాజిట్‌ చేసుకుని పంచాయితీ చేసినట్లు సమాచారం. ఆరోపణలు ఎదుర్కొన్న మహిళను కాగుతున్న నూనెలో చేతులు పెట్టాలని, చేతులు కాలకుంటే మంత్రాలు చేయలేదని నమ్ముతామని తీర్మానించినట్లు తెలిసింది. ఆ మహిళ వేడి నూనెలో చేతులు పెట్టగా కాలలేదని.. దాంతో కొండయ్య డిపాజిట్‌ సొమ్మును వదిలి గ్రామం నుంచే వెళ్లిపోయినట్లు తెలిసింది. అప్పట్లో ఈ వివాదం పోలీస్‌స్టేషన్‌ వరకు వెళ్లగా.. పోలీసులు ఇరువర్గాలకు కౌన్సెలింగ్‌ నిర్వహించి పంపించినట్లు సమాచారం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement